భువనేశ్వర్ కుమార్.. గత కొన్ని రోజులుగా భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోన్నపేరు. అందుకు కారణం 2 మ్యాచ్ లు 2 ఓవర్లు.. ఒకటి పాకిస్థాన్ తో మ్యాచ్ అయితే.. ఇంకోటి ఆస్ట్రేలియాతో మ్యాచ్. ఈ రెండు మ్యాచ్ ల్లో భారత్ పరాజయం పాలైంది. ఇక ఆ రెండు గేముల్లో కూడా భువీ వేసిన 19 వ ఓవరే భారత్ కొంప ముంచింది. దాంతో భువనేశ్వర్ పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. ఇక ఆ ట్రోల్స్ పై భువీ భార్యసైతం స్పందించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే భువనేశ్వర్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచాడు. క్రికెట్ లో ఒక ఆటగాడికి మంచి రోజులు.. చెడ్డ రోజులు ఉండటం సహజమే అంటూ.. భువీ కి మద్దతు పలికాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రపంచ మేటి బౌలర్లు ఎవరు అంటే? వెంటనే గుర్తుకు వచ్చే పేర్లల్లో భువనేశ్వర్ కుమార్ పేరు కచ్చితంగా ఉంటుంది. తన వైవిధ్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేయడంలో భువీ సిద్దహస్తుడు. అలాగే ఇన్ స్వింగ్.. అవుట్ స్వింగ్ వేయడంలో దిట్ట. ఇంతటి గొప్ప బౌలర్ ఈ మధ్యకాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఫామ్ కోల్పొయి.. దారుణంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరుగాంచినప్పటికీ ఆ ఓవర్లలోనే భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. దాంతో ఇంటా.. బయట విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇన్ని విమర్శలు వస్తోన్న నేపథ్యంలో భువీకి అండగా నిలబడ్డాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. భువీ ఫామ్ గురించి మాట్లాడుతూ..”భువనేశ్వర్ మాకు కొత్తేమీ కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా అతడితో మేం ట్రావెల్ అవుతున్నాం. కొన్ని మ్యాచ్ ల్లో రాణించలేకపోయినంత మాత్రాన అతడి నైపుణ్యం తగ్గదు. భువీ తిరిగి అతడి ఫామ్ ను అందుకుంటాడు. ఆ నమ్మకం మాకుంది” అంటూనే..
మరిన్ని విషయాల గురించి రోహిత్ వివరిస్తూ.. “దానికి కావాల్సిందల్లా అతడికి కొంత టైమ్ ఇవ్వడమే. మేం ఆ పనే ప్రస్తుతం చేస్తున్నాం.. ఇక భువనేశ్వర్ గురించి మీకు తెలియని విషయం ఏంటంటే? అతడు అన్ని పరిస్థితుల్లో ఒకే విధంగా మాట్లాడతాడు. పరిస్థితిని బట్టి మారడు.. నిజాయితిగా ఉన్నది ఉన్నట్లుగా అతడి అభిప్రాయాలను వెల్లడిస్తాడు. ఈ క్రమంలోనే జట్టులో కీలకమైన ఆటగాళ్లకు ఫామ్ కోల్పొయినప్పుడు కొంత సమయం ఇవ్వడం అన్నది చాలా సహజమే” అంటూ హిట్ మ్యాన్ భువీకి మద్దతుగా నిలిచాడు. వచ్చే టీ20 ప్రపంచ కప్ లో భూవీ కీలకంగా మారతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆసిస్ పిచ్ లు సీమ్ కు బాగా ఉపకరిస్తాయి. దాంతో బాల్ ను స్వింగ్ చేసే భువీ తన మునపటి ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.