రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో అంచనాలను తలకిందులు చేస్తూ సీనియర్ బ్యాట్స్ మెన్స్ దుమ్ము రేపుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమ ఆటను ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ లో 11వ మ్యాచ్ ఆస్ట్రేలియా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య జరిగింది. ఉత్కంఠంగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లా లెజెండ్స్ చేజేతులా మ్యాచ్ ను ఆసిస్ కు అప్పగించారు. వాస్తవానికి ఈ మ్యాచ్ బంగ్లానే గెలవాలి.. కానీ బ్రాడ్ హడిన్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులతో అజేయంగా నిలిచి.. బంగ్లా లెజెండ్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. తన తుపాన్ ఇన్నింగ్స్ తో ఆసిస్ లెజెండ్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా లెజెండ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా లెజెండ్స్ కు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ నజిముద్దిన్(0) ను బ్రెట్ లీ బోల్తా కొట్టించాడు. తర్వాత క్రమంగా బంగ్లా లెజెండ్స్ వికెట్స్ కోల్పోతూ వచ్చింది. రెండో ఓవర్లో అహ్మద్ (6) రనౌట్ అయ్యాడు. హుస్సేన్ (7), కపాలి(20), ఘోష్(1), సాదత్(20), అబ్దుల్ హసన్(1), షరీఫ్(14), మహమూద్(17) వరుసగా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ క్రమంలోనే బంగ్లా టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ సన్నీ 29 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా లెజెండ్స్ 9 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. బ్రెట్ లీ, వాట్సన్, హాస్టింగ్ లు తలా ఓ వికెట్ తీశారు.
ఇక 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ లెజెండ్స్ కు కూడా తొలి ఓవర్ లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ కామెరూన్ వైట్(1) రజాక్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దాంతో కెప్టెన్ షేన్ వాట్సన్ మరో బ్యాటర్ తో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. ఈక్రమంలోనే వీరి భాగస్వామ్యాన్ని సన్నీ విడదీశాడు. అద్భుతమైన బాల్ తో వాట్సన్(35) ను బోల్డ్ చేశాడు. అప్పటికే ఆసిస్ స్కోర్ 6.3 ఓవర్లకే 73/2 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అందరు ఆస్ట్రేలియా లెజెండ్స్ విజయం లాంఛనమే అనుకున్నారు. కానీ బంగ్లా బౌలర్ సన్నీ4-0-8-4 మ్యాజిక్ చేసి మ్యాచ్ ను చివరి ఓవర్ దాకా తీసుకువచ్చాడు. అవతలి ఎండ్ లో ఆసిస్ బ్యాటర్ బ్రాడ్ హడిన్ విజయం కోసం ఒంటరిగా పోరాడుతున్నాడు. 19 ఓవర్లకు ఆసిస్ లెజెండ్స్ స్కోరు 138-7. దాంతో చివరి ఓవర్లో ఆసిస్ కు 21 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికే మంచి దూకుడు మీద ఉన్న హడిన్ ఈ ఓవర్ లో తన విశ్వరూపాన్నే చూపించాడు.
అబుల్ హసన్ వేసిన ఈ ఓవర్లో ఏకంగా 3 ఫోర్లు ఓ సిక్స్ తో విజయాన్ని లాంఛనంగా పూర్తి చేశాడు. దాంతో ఆసిస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓడిపోయే మ్యాచ్ ను తన సునామీ ఇన్నింగ్స్ తో హడిన్ గెలిపించాడు. దాంతో అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బంగ్లా ఆల్ రౌండర్ 4 వికెట్లు తీసి 32 పరుగులు చేసినప్పటికీ బంగ్లా లెజెండ్స్ ను అపజయం నుంచి కాపాడలేక పోయాడు. ఈ మ్యాచ్ లో మరో విశేషం ఏంటంటే? ఆస్ట్రేలియా లెజెండ్స్ బౌలర్లు ఎక్స్ ట్రా ల రూపంలోనే ఏకంగా 39 పరుగులు సమర్పించుకున్నారు. అందులో వైడ్ల ద్వారా వచ్చినవే 33 రన్స్ కావడం విశేషం. మరి బ్రాడ్ హడిన్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What a thriller! 🤩@aussie_legends defeat @Bangla_Legends by 3 wickets in a nail biting finish! #AUSLvsBANL #RoadSafetyWorldSeries #RSWS #yehjunghailegendary pic.twitter.com/CQH3RuKoVa
— Road Safety World Series (@RSWorldSeries) September 18, 2022