‘రషీద్ ఖాన్..’ పేరుకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ అయినా ఐపీఎల్ ద్వారా తెలుగు క్రికెట్ ప్రేమికులకు బాగానే సుపరిచితుడు. 2017 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ లో సభ్యుడిగా ఉన్న రషీద్, తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల 2022 ఐపీఎల్ సీజన్ లో మాత్రం గుజరాత్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. రషీద్ ఇలా ఒక్క ఐపీఎల్ కాదు.. ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు ప్రాంచైజీ లీగుల్లో ఆడుతుంటాడు. అలా ఆడటం ద్వారా బాగానే డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. కానీ, ఆ డబ్బును మాత్రం తానొక్కడే దాచుకోవట్లేదు. తన పేరుతో ఫౌండేషన్ స్థాపించి కష్టాల్లో ఉన్నవారికి చేతనైన సహాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో భూకంప బాధితులకు అండగా నిలబడ్డాడు.
ఈ ఏడాది జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ లోని పక్తికా ప్రావిన్స్‌లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వందల మంది పౌరులు చనిపోగా.. మరెంతో మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనపై అప్పట్లోనే స్పందించిన రషీద్.. వారికి చేతనైన సహాయం చేయాలంటూ ప్రపంచ క్రికెటర్లందరిని కూడా అర్థించాడు. ఆ సమయంలో తన వంతుగా “రషీద్ ఖాన్ అర్మాన్ ఛారిటబుల్ ఫౌండేషన్” తరుపున పలువురికి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. అలా చెప్పిన మాటను నిజం చేసి చూపించాడు.. రషీద్. భూకంప బాధితులకు కట్టించిన ఇళ్లు నేటికీ పూర్తయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Rashid Khan builds shelters for the families affected by the recent earthquakes in Paktika.
📸: ACB#RashidKhan #Afghanistan #PaktikaAfghanistan #Earthquake #CricketTwitter pic.twitter.com/nUq1oJWzJz
— SportsTiger (@sportstigerapp) October 12, 2022
ఈ తరుణంలో రషీద్ మంచి మనుసుపై ప్రశంశలు వెల్లువెత్తున్నాయి. ‘డబ్బు సంపాదించడం కాదు.. రషీద్ లా మానవత్వాన్ని చాటుకోవాలి’ అంటూ నెటిజన్స్ కొనియాడుతున్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు నిష్క్రమించిన వెంటనే తాలిబన్లు వశం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పాలనలో పరిస్థితులు దయనీయంగా మారినట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తాలిబన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించకపోవడంతో ఒంటరి అయిపోయింది. దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకు క్షీణించిపోగా.. అక్కడ నెలకొన్న పరిస్థితులు లక్షల మందిని పేదరికంలోకి నెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆకలితో అలమటిస్తోన్న ఆఫ్ఘాన్ వాసులు పొట్టచేతపట్టుకొని దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
A great initiative from Rashid Khan for the people of Afghanistan.#CricTracker #RashidKhan #Afghanistan pic.twitter.com/LIIUpkT3db
— CricTracker (@Cricketracker) October 12, 2022