టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు గాయం కారణంగా భారత ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో మరో సీనియర్ స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. ఇటివల ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్ట్ పాసై.. నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అంతకంటే కొన్ని రోజుల ముందే టీమిండియా ఆస్ట్రేలియా చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు సైతం ఆడేసి అక్కడి పరిస్థితులకు మిగతా జట్టు సభ్యులంతా అలవాటు పడ్డారు. మరి షమీ పరిస్థితి ఏంటి? అని చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ.. ఆ డౌట్స్‌ను పటాపంచలు చేస్తూ.. షమీ ప్రాక్టీస్‌లో అదరగొడుతున్నాడు.
నెట్ సెషన్స్‌లో చెమలుచిందిస్తున్న షమీకి ఆస్ట్రేలియాతో తొలి వామప్ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. కానీ.. నెట్స్‌లో మాత్రం షమీ సత్తా చాటాడు. టీమిండియా విధ్వంసకర ఆటగాడు ది ఫినిషర్ దినేష్ కార్తీక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా డీకేకు బౌలింగ్ వేసిన షమీ.. సూపర్ డెలవరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. డిఫరెంట్ షాట్ ఆడబోయిన డీకే.. బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం డీకేను షమీ బౌల్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. బౌల్డ్ అయిన తర్వాత.. ఇలాంటి బాల్స్ వేస్తున్నావ్ ఏంటి బ్రో.. అన్నట్లు షమీకి డీకే సైగ చేస్తూ కనిపించాడు.
కాగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లు పర్వాలేదనిపించినా.. చివరి ఓవర్స్‌లో రావాల్సినన్ని పరుగులు మాత్రం రాలేదు. ఈ మ్యాచ్‌లో పంత్, షమీ, చాహల్, దీపక్ హుడాకు రెస్ట్ ఇచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మార్ష్, ఫించ్ మంచి స్టార్ ఇచ్చారు. 7 ఓవర్లు ముగిసే సరికి 69 పరుగులు చేసి ఆసీస్ ఒక వికెట్ కోల్పోయింది. భువీ మార్ష్‌ను అవుట్ చేశాడు.