కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022 10వ సీజన్ విజేతగా జమైకా తల్లావాస్ నిలిచింది. శుక్రవారం రాత్రి బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి సీపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో జమైకా తల్లావాస్ ఓపెనర్ బ్రెండన్ కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. రాయల్స్ బౌలర్లను చీల్చిచెండాడుతూ 162 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఊదిపడేశాడు. ఈ సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బ్రెండన్ కింగ్.. ఫైనల్లోనూ అదే జోరు చూపించాడు. 50 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సులతో 83 పరుగులు దంచి.. జమైకాను మూడోసారి కరేబియన్ లీగ్ విజేతగా నిలిపాడు. మూడో సారి సీపీఎల్ టైటిల్ సాధించిన జమైకా తల్లావాస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మూడు టైటిళ్ల రికార్డును సమం చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆజమ్ ఖాన్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ కార్న్‌వాల్ 36, కెప్టెన్ కైల్ మేయర్స్ 29 పరుగులతో రాణించారు. బార్బడోస్‌కి ఓపెనర్లు మంచి ఆరంభం అందించినా.. దాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించలేకపోయారు. టాపార్డర్ బ్యాటర్లు రాణించడంతో రాయల్స్ ఆ స్కోర్ చేయగలిగింది. జమైకా బౌలర్లలో ఫాబియన్ అలెన్, నికోల్‌సన్ మూడేసి వికెట్లతో రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేశారు. వసీమ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
ఒక మోస్తారు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జమైకా తల్లావాస్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కెన్నర్ లివ్స్‌ను కైల్ మేయర్స్ క్లీన్ బౌల్డ్ చేసి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. కానీ.. మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్ మాత్రం రాయల్స్ బౌలర్లపై ఎదురుదాటికి దిగాడు. అతనికి బ్రూక్స్ కూడా జతకలవడంతో జమైకా విజయం వైపు దూసుకెళ్లింది. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 47 పరుగులు చేసిన బ్రూక్స్‌ను హోల్డర్ అవుట్ చేయడంతో 11వ ఓవర్‌లో జమైకా రెండో వికెట్‌ను కోల్పోయింది. కానీ.. అప్పటికే ఆ జట్టు సగం టార్గెట్‌ను పూర్తి చేసింది. మిగిలిన లక్ష్యాన్ని జమైకా తల్లావాస్ కెప్టెన్ రోవ్‌మన్ పోవెల్‌తో కలిసి బ్రెండన్ పూర్తి చేశారు. మ్యాచ్‌ను కింగ్ సిక్స్‌తో ముగించడం విశేషం. 162 పరుగుల లక్ష్యాన్ని జమైకా తల్లావాస్ 16.1 ఓవర్‌లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి 8 వికెట్ల తేడాతో సీపీఎల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన బ్రెండన్ కింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది.
Rovman Powell has led the Jamaica Tallawahs to a sensational victory today 👏
This is their third CPL title, and their first trophy since 2016 🏆 #CPL22
— ESPNcricinfo (@ESPNcricinfo) October 1, 2022
Brandon King,Winning SIX, 2013, 2016 .. 2022: CHAMPIONS, JAMAICA TALLAWAHS. As authoritative a finish as it could get, and as authoritative a shot to seal it off — proper monster swing to tonk it downtown#CPLFinal pic.twitter.com/3ZcByB2Mgd
— #INDvSA #INDvSA #T20Worlcup (@SonyTen_Cricket) October 1, 2022
ఇది కూడా చదవండి: పాపం.. పాక్‌ను పిచ్చికొట్టుడు కొట్టిన ఇంగ్లండ్! భారీ టార్గెట్‌ను 15 ఓవర్లలోనే..