దినేష్ కార్తీక్.. టీమిండియాలో ఒక సంచలనం. అద్భుతమైన టాలెంట్‌తో టీమిండియాలోకి అడుగుపెట్టి.. దక్కాల్సిన గుర్తింపు, అవకాశాలు దక్కకున్నా నిరాశ చెందలేదు. పర్సనల్ లైఫ్‌లో ఊహించని దారుణాలు జరిగినా తట్టుకుని నిలబడ్డాడు. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకడైన డీకే.. మళ్లీ 15 ఏళ్ల తర్వాత కూడా టీ20 వరల్డ్ కప్ కోసం తన ఎంపికను అనివార్యం చేసిన తీరు అసామాన్యం. 2007లో టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఆడి మళ్లీ వరల్డ్ కప్ టీమ్‌కు ఎంపికైంది ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే మరొకరు దినేష్ కార్తిక్. మిగతా వాళ్లంతా క్రికెట్ గుడ్‌బై కూడా చెప్పేశారు. రోహిత్ టీమిండియా కెప్టెన్ కనుక అతను జట్టులో ఉండటం పెద్ద విషయం కాకపోయినా.. 37 ఏళ్ల వయసున్న డీకే.. మళ్లీ టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక కావడం విశేషం. పైగా ఒకానొక దశలో క్రికెట్‌కు పుల్‌స్టాప్ పెట్టి కామెంటేటర్‌గా మారి.. మళ్లీ తన లక్ష్యం ఇది కాదని తెలుసుని ఎంతో శ్రమించి ఈ స్థాయికి చేరుకోవడం అంత సాధారణ విషయం కాదు. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని దినేష్ కార్తీక్ ఎలా సాగించాడు.. అసలు దినేష్ కార్తీక్ కెరీర్‌ను మలుపుతిప్పిన ఇన్నింగ్స్ ఏది? ఈ విషయాల గురించి ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం..
2004లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో టీమిండియాలోకి అడుగుపెట్టిన దినేష్ కార్తీక్ ఆ వెంటనే టెస్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో డీకే టీ20 కెరీర్‌ను ప్రారంభించాడు. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ కోసం కూడా ఎంపికయ్యాడు. కానీ.. అప్పటికే మహేంద్రసింగ్ ధోని టీమిండియాకు కెప్టెన్ కావడం, వికెట్ కీపింగ్‌తో పాటు 6, 7వ స్థానంలోనే బ్యాటింగ్‌కు వస్తుండటం దినేష్ కార్తీక్‌కు ప్రతికూలంగా మారింది. దీంతో దినేష్ కార్తీక్ టీమిండియాలో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా కొన్ని మ్యాచ్‌లు, ధోని లేకపోతే కీపర్ కమ్ బ్యాటర్‌గా ఆడేవాడు. కానీ.. డీకేకు జట్టులో సుస్థిర స్థానం ఉండేది కాదు. జట్టులో అడపాదడపా కనిపిస్తూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. కానీ.. ధోని లాంటి ప్లేయర్ ముందు డీకే సెకండ్ ప్రెయారిటీగానే ఉండిపోయాడు.
కానీ.. 2018లో జరిగిన నిధాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దినేష్ కార్తీక్ కెరీర్‌లో ఊహించని మార్పు తెచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన నిధాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియాను బంగ్లా బౌలర్లు కట్టడి చేస్తూ.. మ్యాచ్‌ను చివరి వరకు తెచ్చారు. టీమిండియా విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు కావాల్సిన దశలో బంగ్లా బౌలర్ ముస్తఫీజుర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌ను అద్భుతంగా వేసి కేవలం ఒకే ఒక్క రన్ లెగ్‌బై రూపం ఇచ్చాడు. చివరి బంతికి మనీష్ పాండే(28)ని కూడా అవుట్ చేసి భారత్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. దీంతో టీమిండియాకు 12 బంతుల్లో 34 రన్స్ కావాలి. పాండే స్థానంలో దినేష్ కార్తీక్ క్రీజ్‌లోకి వచ్చాడు. భారత్ గెలుపుపై ఎవరీ అసలు నమ్మకమే లేదు. అప్పటికే బంగ్లా ఆటగాళ్లు సంబురాలు మొదలెట్టేశారు. నాగిని డాన్స్‌లతో రచ్చ చేస్తున్నారు.
కానీ.. 19వ ఓవర్‌లో అద్భుతమే జరిగింది. రూబెల్ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్ విరుచుకుపడ్డాడు. 6, 4, 6, 0, 2, 4తో 22 పరుగులు పిండుకుని విధ్వంసం సృష్టించాడు. డీకే ఇచ్చిన షాక్‌తో బంగ్లాకు ఫీజులు ఎగిరిపోయాయి. కానీ.. ఇంకా మ్యాచ అయిపోలేదు. విజయానికి చివరి ఓవర్‌లో ఇంకా 12 పరుగులు కావాలి. 20వ ఓవర్ తొలి మూడు బంతుల్లో కేవలం 3 పరుగులే వచ్చాయి. దీంతో డీకే 19వ ఓవర్‌లో సృష్టించిన విధ్వంసం వృథా అవుతుందా అనే అనుమానం కలిగింది. కానీ.. 4వ బంతికి ఫోర్ కొట్టిన విజయ్ శంకర్ 5వ బంతికి అవుట్ అయ్యాడు. ఇక చివరి బంతికి టీమిండియా గెలవాలంటే 5 పరుగులు కావాలి. స్ట్రైక్‌లో దినేష్ కార్తీక్ ఉన్నాడు. ప్రెషర్.. ప్రెషర్.. ఇంత ఒత్తిడిలోనూ ఎంతో కూల్‌గా డీకే చివరి బంతికి భారీ సిక్స్ కొట్టి టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఊహించని విధంగా ఆడి, ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో 8 బంతుల్లో 28 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో దినేష్ కార్తీక్ పేరు మారుమోగిపోయింది. అతనికి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఈ ఇన్నింగ్స్‌తో తనలో గొప్ప ఫినిషర్ దాగి ఉన్నాడనే విషయం క్రికెట్ అభిమానులతో పాటు డీకేకు కూడా అప్పుడే అర్థమైంది. ఇక దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్ ని శ్రీలంక బోర్డు తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయగా.. ఆ వీడియో హయ్యస్ట్ వ్యూస్ క్రికెట్ వీడియోగా రికార్డు సాధించింది. ఈ వీడియో దెబ్బకి దినేష్ కార్తీక్ కి విదేశాల్లో కూడా ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు.
నిజానికి ఈ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా దినేష్ కార్తీక్‌కు టీమిండియాలో సుస్థిర స్థానం దక్కలేదు. ఐపీఎల్‌లో రాణిస్తున్నా.. టీమిండియాలో మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టంలానే దినేష్ కార్తీక్ మారిపోయాడు. ఇక వైవాహిక బంధంలోనూ డీకేకు దారుణ మోసం జరిగింది. తన మొదటి భార్య దినేష్‌ను మోసం చేసి మరో టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్‌తో సంబంధం పెట్టుకుని గర్భం కూడా దాల్చింది. ఈ ఘటన డీకేను మానసికంగా కుంగదీసింది. ఆ తర్వాత మరో వివాహం చేసుకున్న డీకే.. కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. కానీ.. ఏదో తెలియని వెలితి డీకేను వెంటాడింది. తన నిధాస్ ట్రోఫీ ఇన్నింగ్స్ స్ఫూర్తితో టీమిండియాలో ధోని రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉన్న ఫినిషర్ రోల్‌ను భర్తీ చేస్తూ.. తిరిగి జట్టులోకి రావాలని తీవ్రంగా శ్రమించాడు.
కామెంట్రీకి గుడ్‌బై చెప్పి మళ్లీ బ్యాట్ పట్టాడు. దినేష్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అంతా నవ్వుకున్నారు. 35 ఏళ్ల వయసులో ఇది సాధ్యం కాదని ఉచిత సలహాలు ఇచ్చారు. కానీ డీకే తనను తాను బలంగా నమ్మాడు. అందుకు తగ్గట్లే నెట్స్‌లో చెమటలు చెందించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్‌కు ఆడిన డీకే, చివరి ఓవర్లలో ఊహించని విధంగా పవర్ హిట్టింగ్‌తో రెచ్చిపోయాడు. డీకే ఇస్తున్న ఫినిషింగ్ టచ్‌లకు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో టీమిండియా సెలెక్టర్లకు డీకేను జట్టులోకి తీసుకోక తప్పలేదు. ఇలా తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాలోకి వచ్చిన డీకే.. 15 ఏళ్ల క్రితం తొలి వరల్డ్ కప్ ఆడి మళ్లీ 2022 టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికవ్వడం నిజంగా గొప్పవిషయం. దీని వెనుక అతని కృషి, పట్టుదల అమోఘం. దినేష్ కార్తీక్ జీవితం.. లైఫ్‌లో ఏదో కోల్పోయాం అని బాధపడే యువతకు స్ఫూర్తిదాయకం. మరి దినేష్ కార్తీక్ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.