ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో పొట్టి ప్రపంచ కప్ సంగ్రామానికి టాస్ పడనుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి చాలా ముందుగానే టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి లోకల్ టీమ్‌తో పెర్త్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్ నేడు(గురువారం) ఆడనుంది. కాగా.. టీమిండియా బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తున్నా.. చిక్కంతా బౌలింగ్‌తోనే వచ్చిపడింది. పైగా టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వరల్డ్ కప్‌కు దూరం కావడంతో.. టీమిండియా బౌలింగ్ మరింత వీక్‌గా మారింది. భువనేశ్వర్ కుమార్ లీడ్ బౌలర్‌గా యువ పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ వంటి పేస్ బౌలర్లతో టీమిండియా వరల్డ్ కప్‌కు వెళ్లింది.
కాగా.. ఈ బౌలింగ్ ఎటాక్‌పై పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. భారత ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో.. టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను భువనేశ్వర్‌కుమార్ లీడ్ చేయనున్నాడని.. కానీ, అతని బౌలింగ్ ఆస్ట్రేలియా పిచ్‌లకు సరిపోదని అన్నాడు. ఆసీస్ పిచ్‌లపై పేస్ చాలా ముఖ్యమని అన్నాడు. భువనేశ్వర్ మంచి బౌలర్ అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ.. అతని బౌలింగ్‌లో వేగం ఉండదు. కేవలం స్వింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడతాడు. యార్కర్లు కూడా కచ్చితంగా వేయగలడు కానీ.. ఆస్ట్రేలియాలో అన్నింటికంటే వేగం చాలా ముఖ్యం. పిచ్ స్వింగ్‌కు అనుకూలించకపోతే.. భువనేశ్వర్‌కుమార్‌ను బ్యాటర్లు చాలా ఈజీగా ఎదుర్కొని పరుగులు పిండుకుంటారు.
ఇక గాయంతో వరల్డ్ కప్‌కు దూరమైన బుమ్రా స్థానంలో మరో పేసర్‌ను భారత సెలెక్టర్లు ఇంకా ఎంపిక చేయలేదు. కానీ.. బుమ్రా స్థానంలో టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా షమీ కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేసిన విషయం తెలిసిందే. షమీతో పాటు మొహమ్మద్ సిరాజ్‌ను కూడా టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకునేందుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బుమ్రా స్థానంలో ఈ ఇద్దరిలో ఒకరు వరల్డ్ కప్ ఆడనున్నారు. తాజా సౌతాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చి.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు.
#WasimAkram feels #BhuvneshwarKumar will probably struggle, as he lacks pace to be effective in Australia.#TeamIndia #T20WorldCup pic.twitter.com/LatrT2jgul
— Circle of Cricket (@circleofcricket) October 12, 2022
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా రావాలని కోచ్ ద్రవిడ్ నుంచి ఉమ్రాన్ మాలిక్‌కు పిలుపు! కానీ..