పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్సప్రెస్ షోయాబ్ అక్తర్ అందరకి సుపరిచితమే. మైదానంలో తన రాకాసి బౌన్సర్లతో బ్యాటర్లను బెంబేలెత్తించిన ఈ రావల్పిండి ఆటగాడు ఆటకు విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలా అని ఊరుకుంటున్నాడా! లేదు.. తన పేరుతోనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని.. అందులో టీమిండియాపైనో లేదంటే ఆటగాళ్ళపైనో అక్కసు వెళ్లగక్కుతూ ఉన్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీపై అక్తర్ గతంలో చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అక్తర్.. ‘కోహ్లీ ఏడిస్తే వచ్చే ఆనందం ఎందులోనూ దొరకదని..’ పేర్కొనడం గమనార్హం.
2011లో ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టు 2014లో జరిగిన ఆసియా కప్ లో చేతులెత్తేసింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో శ్రీలంక జట్టు ఛాంపియన్ గా నిలిచింది. కాగా, ఈ టోర్నీలో భాగంగా ఇండియా- శ్రీలంక మధ్య జరిగిన లీగ్ మ్యాచులో భారత జట్టు 2 వికెట్ల తేడాతో ఓటమి పాలవుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. శ్రీలంక 49.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అయితే.. ఈ టోర్నీలో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఓటమి బాధతో కాస్త దిగాలుగా కనిపిస్తాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేసిన అక్తర్.. ” తినడంలో.. నిద్రపోవడంలో ఉండే ఆనందం కంటే.. కోహ్లీ ఏడిస్తే వచ్చే మజాయే వేరు..” అని క్యాప్షన్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ పోస్టుపై కోహ్లీ అభిమానులు భగ్గుమంటున్నారు. “నువ్ ఈ తరం క్రికెట్ లో లేవు కాబట్టి సరిపోతుంది.. ఉండుంటే నీకు కోహ్లీ చుక్కలు చూపించేవాడు” అని కొందరు, “ఇతర దేశాల ఆటగాళ్లపై ఏడవటమే.. నీపని” అని మరికొందరు కామెంట్స్ చేసున్నారు. కాగా, ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగా.. శ్రీలంక 49.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. కుమార్ సంగర్కర(103) అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందిస్తాడు.