ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే విభిన్నమైన కథలు, క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకుంటూ.. కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ సేన్.. తాజాగా మరో ఫీల్ గుడ్ చిత్రం ఓరి దేవుడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్‌సేన్ ఈ సినిమాలో హీరోగా నటించగా.. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించాడు. అక్టోబర్ 21న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం.. పాటిజివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో వెంకటేష్ కూడా ఉండటంతో.. దీనిపై ఆది నుంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
తమిళంలో విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ మూవీకి రీమేక్‌గా ఓరి దేవుడా చిత్రం తెరకెక్కింది. తమిళంలో దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తే తెలుగులో కూడా దర్శకత్వం వహించాడు. తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక థియేటర్‌లో విడుదలైన సినిమాలు.. ఆ తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓరి దేవుడా సినిమా కూడా ఓటీటీ పార్టనర్‌ను లాక్ చేసుకుంది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్.. ఓరి దేవుడా స్ట్రీమింగ్ హాక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఓరి దేవుడా చిత్రంలో మరాఠీ బ్యూటీ మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు రాహుల్ రామకృష్ణ సినిమాల్లో కీలక పాత్రలో నటించాడు. ఇక చిన్ననాటి నుంచి స్నేహితులుగా పెరిగిన యువతీయువకుడు.. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి రావడం.. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా.. విడాకులు తీసుకోవడానికి సిద్ధపడటం.. ఇంతలో ఓ అపరిచిత వ్యక్తి కారణంగా చోటు చేసుకునే మలుపులతో ఓరి దేవుడా సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు.