సాధారణంగా ప్రజలకు రక్షణగా పోలీసులు ఉంటారు. వారు ఉన్నారు అనే ధైర్యంతోనే ప్రజలు హాయిగా జీవిస్తున్నారు. అయితే కేరళలోని ఓ పోలీస్ స్టేషన్ కే రక్షణ కావాల్సి వచ్చింది. దీంతో అక్కడి పోలీసులు పాములను తమకు కాపాలాదారులుగా పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఈ మాటలు వినడానికి వింతగా ఉన్న అనిపించినా… ఇది ముమ్మాటికి నిజం. చట్టాన్ని రక్షించే పోలీసులకే పాములు రక్షకులుగా మారాయి. పోలీసులతో పాటు వారి స్టేషన్ ను అవి కాపాడుతున్నాయి. మరి..ఈ పాముల కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళనాడు సరిహద్దులోని కేరళ అటవీప్రాంతంలో కుంబుమ్మెట్టు పోలీస్ స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో అక్కడి నుంచి తరచుగా కోతులు గుంపులు గుంపులుగా స్టేషన్ లోకి చోరబటి బీభత్సం సృష్టించేవి. కోతులు స్టేషన్ ఆవరణలో తిరుగుతూ మా కాంపౌండ్‌లోని కూరగాయల తోటను కూడా నాశనం చేసేవి. దీంతో అక్కడ పనిచేసే పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎంత తరిమికొట్టినా.. మళ్లీ మళ్లీ వచ్చి ఇబ్బంది పెడుతుండేవి. ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలియక అధికారులు తలలు పట్టుకునేవారు. ఇలాంటి సమయంలో సమీపంలోని ఉడుంబన్‌చోలలో ఉండే ఓ రైతు పోలీసులకు ఓ సలహా ఇచ్చారు.
తమ పంటపొలాల్లోకి కొతులు రాకుండా రబ్బర్ పాములను ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. ఆ రబ్బరు పాములను చూసి కోతులు బెదిరిపోతున్నాయని ఆ రైతు తెలిపారు. దీంతో పోలీసులు కూడా ఓ సంస్థ తయారు చేసిన రబ్బరు పాము బొమ్మలను కొనుగోలు చేశారు. ఆ డమ్మీ సర్పాలను స్టేషన్ పరిసరాల్లోనూ, చెట్లపైనా ఏర్పాటు చేశారు. అవి రబ్బరు సర్పాలే అయినప్పటికి చూడ్డానికి నిజమైన పాములు మాదిరే కనిపించాయి. ఈ పాములను చూసిన కోతులు భయంతో పోలీస్ సేషన్ వైపు రావడం మానేశాయి. దీంతో కోతుల బెడద తగ్గడంతో పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు.