గురువులంటే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. వారిని మంచి మార్గంలో ఉన్నత శిఖరాలకి చేర్చేవారు. పిల్లలకు మంచి చెడుల్లోని తేడాలు తెలిపి.. సమాజాని ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారు. మరికొందరు గురువులు అయితే కష్టాల్లో ఉన్న తమ విద్యార్ధులను కాపాడుతుంటారు. పిల్లల కష్టానికి తమ కష్టంగా భావించి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. పిల్లల అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైన గురువులు సిద్ధంగా ఉంటారు. తాజాగా ఓ ప్రొఫెసర్ చేసిన పని అందరికి కంటతడి పెట్టిచింది. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉంటారా? అనే సందేహం వచ్చేలా చేశారు ఆ ప్రొఫెసర్. ఇంతకి ఆయన ఏమి చేశారంటే.. పేద, నిరాశ్రయ విద్యార్ధుల చదువు కోసం చెప్పులు, షూలకు పాలీష్ చేసి డబ్బులు సంపాదించారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పాడియనల్లూరుకు చెందిన ప్రొఫెసర్ సెల్వకుమార్ ఓ ప్రైవేటు కళాశాలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. 2004లో మదర్ థెరిసా పేరుతో ఓ పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పేద, అనాథ విద్యార్ధులకు విద్యను అందిస్తూ వస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొంతకాలం నుంచి పాఠశాల నిర్వాహణ కష్టంగా మారింది. దీంతో పిల్లల చదువుకు మధ్యలో ఆగిపోకుడని ఆయన భావించారు. ఎలాగైన వారి చదువును ముందుకు కొనసాగించాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. కళాశాలకు సెలవు ఉన్న రోజుల్లో ప్రముఖ ప్రాంతాలకు వెళ్లి.. “నేను మీ చెప్పులను తుడుస్తాను.. మీరు నా వద్ద ఉన్న పిల్లల కన్నీటిని తుడవండి” అంటూ అటుగా వెళ్లే వారిని ప్రొఫెసర్ సెల్వకుమార్ కోరుతున్నారు.
జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో చెప్పులు తుడవడం, షూలకు పాలీష్ చేసి తద్వారా వచ్చే నిధులను పాఠశాల నిర్వహణ కోసం వెచ్చిస్తోన్నారు. ఈ నిధుల కోసం ఈయన ప్రయాణం ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో సాగింది. తాజాగా తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని కామరాజర్ అంబేడ్కర్వ విగ్రహం వద్ద గురువారం చెప్పులు తుడవడం , షూలకు పాలీష్ చేసి నిధులను సేకరించారు. ఆయన గురించి తెలుసుకున్న స్థానికులు.. ప్రశంసల వర్షం కురిపించారు. మరికొందరు స్థానిక నాయకులు ప్రొఫెసర్ సెల్వకుమార్ ని పూలమాలతో సత్కరించారు.