Video Viral: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తోంది. ఇంట్లో తినడానికి సరిగా తిండి లేని ఎంతో మంది పిల్లలు స్కూలుకు వెళ్లి కడుపు నింపుకుంటున్నారు. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, కొన్ని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోంది. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు, చారులాంటి పప్పు పిల్లలకు ఆహారంగా మారుతోంది. కొన్ని స్కూళ్లలో వంట వండే వాళ్లు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వంట చేస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు శుభ్రత లేకుండా వంట వండుతున్నారు.
మరికొన్ని చోట్ల వంట చేయించే మధ్య వర్తులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. నాసి రకమైన సరుకులతో వంట వండిస్తున్నారు. కొన్ని సార్లు ఎలాంటి కూరలు వండించకుండా.. పిల్లలకు కేవలం అన్నం మాత్రమే వడ్డిస్తున్నారు. వాటిలోకి కూరకు బదులు ఉప్పును వేస్తున్నారు. తాజాగా, ఓ స్కూల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనంగా అన్నం, ఉప్పు పెట్టారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో వెలుగుచూసింది. అయోధ్యలోని ఓ ప్రైమరీ స్కూలు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా ఉత్తి అన్నం, ఉప్పు పెట్టగా వారు దాన్ని తినలేక ఇబ్బందులు పడ్డారు. కానీ, కడుపు కాల్చుకోలేక తినేశారు.
ఓ వ్యక్తి పిల్లలు అన్నం, ఉప్పుతో భోజనం చేస్తున్న దృశ్యాలను వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. యోగీ ఆధిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో.. అదీ బీజేపీ పాలిత ప్రాంతంలో పిల్లలకు తిండి కూడా సరిగా ఉండటం లేదంటూ ప్రతి పక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ పియూష్ రాయ్ దీనిపై స్పందించారు. ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతీ విద్యార్థికి ఓ రోజుకు రూ.4.70పైసలు ఇస్తోంది. ఓ మంచి భోజనం పెట్టడానికి ఆ డబ్బులు చాలటం లేదంటూ స్కూళ్ల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు చాలా సార్లు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలి’’ అని పేర్కొన్నాడు.
A video of children at a primary school in UP’s Ayodhya being served boiled rice and salt as mid day meal has surfaced. pic.twitter.com/5wVaE9XWKC
— Piyush Rai (@Benarasiyaa) September 28, 2022