హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగం చేసుకునే మనం.. ఎప్పుడో పండగకు ఊరు వెళ్ళినప్పుడు కుటుంబాన్ని వదిలిపెట్టి రావాలంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అలాంటిది దేశం కోసం ఆలోచించే సైనికులు సరిహద్దుకు వెళ్లేముందు తమ కుటుంబాన్ని చూసి ఎంత విలవిలలాడిపోతారో కదా. అందులోనూ అప్పుడే పుట్టిన పిల్లల్ని వదిలిపెట్టి ఎవరికీ వెళ్లాలనిపించదు. కానీ ఒక మహిళా జవాన్ దేశం కోసం ఆలోచించి తన పసి బిడ్డను వదిలిపెట్టి సరిహద్దుకు బయలుదేరారు. వెళ్లే ముందు తన కూతుర్ని చూసి ఏడ్చేశారు.
దేశంలో ఉన్న మనుషులతో ఎటువంటి రక్తసంబంధం లేకపోయినా ఆ మనుషుల భద్రత కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి సరిహద్దుకు పయనమవుతారు సైనికులు. వీరిలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అప్పుడే పిల్లలు పుట్టిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించని వారు కూడా ఉంటారు. సెలవుల నిమిత్తం ఇంటికి వెళ్లి కుటుంబంతో కొన్ని రోజులు గడిపి.. సెలవులు ముగిశాక కుటుంబాన్ని వదిలిపెట్టి బోర్డర్ కి వెళ్లాలంటే ఎంత నొప్పి ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. అయినా గానీ దేశం కోసం బాధలను, నొప్పిని భరిస్తారు. ఈ క్రమంలో ఒక సైనికురాలు తన 10 నెలల బిడ్డను వదిలిపెట్టి బోర్డర్ కు బయలుదేరారు. ఆ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం నెటిజన్స్ ను కంటతడి పెట్టిస్తుంది.
కొల్హాపూర్ కి చెందిన వర్ష పాటిల్ అనే సైనికురాలు రైల్వేస్టేషన్ లో తన 10 నెలల పాపను వదిలిపెట్టి రైలు ఎక్కారు. బీఎస్ఎఫ్ లో పని చేసే ఆమె కొన్ని నెలల క్రితం మెడికల్ లీవ్ మీద ఇంటికి వచ్చారు. అయితే సెలవులు అయిపోవడంతో తన 10 నెలల పాపను వదిలిపెట్టి తిరిగి ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కొల్హాపూర్ రైల్వేస్టేషన్ నుంచి ఆమె తన కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కూతుర్ని వదిలిపెట్టి వెళ్తున్నందుకు ఆమె చిన్న పాపలా ఏడ్చేశారు. మాతృత్వం ముఖ్యమా? దేశం ముఖ్యమా? అంటే ఆమె దేశానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
దేశం కోసం మాతృ ప్రేమను వదిలిపెట్టి సరిహద్దుకు బయలుదేరిన సైనికా నీకు సెల్యూట్ అంటూ కొనియాడుతున్నారు. ఆడవాళ్లు బలహీనులు అని అనుకునే వారికి ఈ వీడియోనే సమాధానం. వర్ష పాటిల్ అనే సైనికురాలు సరిహద్దు వద్ద సైనికురాలిగా, ఇంటికి వస్తే తల్లిగా రెండు పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఇంతకంటే దృఢంగా ఎవరుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేశం కోసం ఇంత కమిటెడ్ గా ఉంటారా? దేశమా? దేహమా? అంటే దేశమే అని అనేంత ధైర్యం వీరికి ఉంటుందా? నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడైనా మనుషులు నీతిగా, నిజాయితీగా బతకాలనిపించాలి. ఈ దేహాల కోసమే కదా వారు వారి దేహాల గురించి పట్టించుకోకుండా బోర్డర్ లో కాపలా కాస్తున్నారు. మరి ఇంతటి త్యాగమూర్తులైన సైనికుల గురించి మీరేమంటారు? దేశం కోసం 10 నెలల కూతురుని వదిలిపెట్టి సరిహద్దుకు బయలుదేరిన మాతృమూర్తి, సైనికురాలికి ఒక సెల్యూట్ చేయండి.