పేదరికం అతడి ప్రయత్నానికి తలొగ్గింది.. కుటుంబ సమస్యలు అతని పోరాటం ముందు మోకరిల్లాయి. చదవాలనే ఆసక్తి ముందు.. ఎవరెస్ట్ శిఖరమంత సమస్య అయినా అతడికి కష్టంగా కనిపించలేదు. ఎన్ని సమస్యలు వెనక్కిలాగుతున్నాగానీ తన పోరాటాన్ని మాత్రం విడలేదు బీహార్ కు చెందిన కమల్ కిశోర్. రోడ్డు పక్కన టీ అమ్ముకునే స్థాయి నుంచి నేడు కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎదిగిన తీరు అందరికి ఆదర్శం. నీలో ఆత్మవిశ్వాసం ఉంటే ఏ సమస్యా నీకు సమస్యగా కనిపించదని నిరూపించాడు కమల్ కిశోర్ మండల్. పొద్దున కాలేజీ స్టూడెంట్ గా.. మధ్యాహ్నం అంటెండర్ గా విధులు నిర్వర్తిస్తూనే తన గమ్యం వైపు అడుగులు వేశాడు. మరి అందరికి ఆదర్శంగా నిలిచిన కిశోర్ విజయగాథను ఓ సారి పరిశీలిద్దాం.
కమల్ కిశోర్ మండల్.. బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ ముండి చక్ ప్రాంతానికి చెందిన పేద కుటుంబంలో జన్మించాడు. కమల్ కు చిన్నతనం నుంచి చదువంటే ఎంతో ఆసక్తి. దాంతో చదువుల్లో ఎప్పుడూ ముందుండే వాడు. ఈ క్రమంలోనే తన డిగ్రీని పూర్తి చేసుకున్న కమల్ కు పేదరికం అడ్డుగా నిలిచింది. ఇక చేసేది ఏమీలేక చదువును మధ్యలోనే ఆపేసి తన తండ్రితో కలిసి రోడ్డు పక్కనే టీ కొట్టు నడిపేవాడు. పనైతే చేసేవాడు కానీ తన ధ్యాసంత చదువుపైనే ఉండేది. ఈ క్రమంలోనే 2003లో ముంగేర్ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా జాబ్ వచ్చింది. కొన్ని సంవత్సరాలు సెక్యూరిటీగా చేసిన తర్వాత.. ప్రమోషన్ రావడంతో అంబేడ్కర్ పీజీ కాలేజ్ కు అటెండర్ గా వెళ్లాడు. ఈ ప్రమోషన్ కమల్ కిశోర్ జీవితాన్నే మలుపు తిప్పింది. కాలేజీలో విద్యార్థులను, ప్రొఫెసర్లను చూసి తనలోని చదువు రాక్షసుడు నిద్రలేచాడు.
దాంతో అనుకున్నదే తడువుగా 2013లో అదే కాలేజీలో పీజీ చేసి.. 2019లో పీహెచ్ డీ సైతం పూర్తి చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ క్రమంలోనే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET)లో సైతం ఉత్తీర్ణత సాధించాడు. ఇక 2020లో రాష్ట్ర యూనివర్సీటీ సర్వీస్ కమిషన్ నాలుగు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని దశలను దాటుకుని చివరకు తాను పని చేసిన కాలేజీలోనే అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా నియమించబడ్డాడు. దాంతో తన ఇన్ని సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కిందని కమల్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఉదయం కాలేజీకి వెళ్లి.. మధ్యాహ్నం అటెండర్ గా విధులు నిర్వర్తించి.. రాత్రి చదువుకునే వాడినని కమల్ కిశోర్ తెలిపాడు. ఈ క్రమంలోనే తన విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నానని కమల్ పేర్కొన్నాడు.