అదృష్ట దేవత తలుపు తట్టాలే కానీ.. అప్పటి వరకు కఠిక పేదరికం అనుభవించే వారి జీవితం కూడా అనూహ్యంగా మారిపోతుంది. తినడానికి తిండి కూడా దొరకని స్టేజీ నుంచి మరో పది మందికి తిండి పెట్టే స్థాయికి చేరుస్తుంది. కావాల్సిందల్లా కాలం కలసి రావడమే. అయితే ఈ మధ్య కాలంలో కేరళలో ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరలవుతున్నారు కొందరు. వారు కలలో కూడా ఊహించనంత సొమ్ము ఇంటికి చేరుతుంది. కొన్ని రోజుల క్రితం అప్పుల భారం తాళలేక విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న వ్యక్తికి లాటరీలో ఏకంగా 15 కోట్ల రూపాయలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో కేరళ వాసిని లాటరీ రూపంలో అదృష్టం పలకరించింది. ఇంటి మీద తీసుకున్న లోన్ బకాయి పడటంతో.. ఇంటిని జప్తు చేస్తామని బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కానీ వేళ.. వారిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఏకంగా 70 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఆ వివరాలు..
కేరళలోని కొల్లాంజిల్లా మ్యాంగనపల్లిలోని ఎడవస్సేరీకి చెందిన పోఖున్జు స్కూటర్ మీద తిరుగుతూ చేపలు అమ్ముతూ జీవనం సాగించేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. అయితే చేపలు అమ్మగా వచ్చి ఆదాయం సరిపోకపోవడం.. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇంటి కాగితాలను బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారు 9 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. అయితే రుణం చెల్లించడంలో విఫలం అయ్యాడు. ఈ క్రమంలో లోన్ తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించకపోతే.. ఇంటిని జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు పోఖున్జుకు నోటీసులు పంపారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బ్యాంక్ నుంచి నోటీసు వచ్చింది. తీసుకున్న లోన్‌ని.. వడ్డీతో సహా మొత్తం రూ.12 లక్షలు అయ్యిందని.. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, లేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులో హెచ్చరించారు. విషయం తెలిసి పోఖున్జు తీవ్రంగా బాధపడ్డాడు. బ్యాంకు వారు చెప్పినట్లు.. డబ్బు చెల్లించకపోతే.. ఇంటిని జప్తు చేస్తారు. అప్పుడు తనతో పాటు భార్యాబిడ్డలు రోడ్డునపడతారని తీవ్రంగా కలత చెందాడు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా.. తమను ఎవరు ఆదుకుంటారని తీవ్రంగా బాధపడసాగాడు. అయితే అతడి వేదన చూసి అదృష్టదేవతకు కనికరం కలిగింది. వెంటనే బ్యాంక్ నోటీసులు అందిన మూడు గంటల్లోపే.. లాటరీ రూపంలో పోఖున్జు తలుపు తట్టింది.
బుధవారం మధ్నాహ్నం.. 3 గంటల సమయంలో పోఖున్జు.. లాటరీలో 70 లక్షలు గెలిచినట్లు తెలిసింది. రోడ్డున పడబోయే వేళలో.. ఇంత భారీ మొత్తం డబ్బు చేతికి అందుతుండటంతో.. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక లాటరీలో గెలిచిన డబ్బుతో తన కష్టాలన్నీ తీరిపోతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు పోఖున్జు. వాస్తవానికి అతడికి లాటరీపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పోఖున్జు తండ్రి యూసఫ్‌కు మాత్రం లాటరీ టికెట్లు పిచ్చి ఎక్కువ. ఈ క్రమంలో అతడి తండ్రి కొన్ని రోజుల క్రితం సరదాగా కొన్న లాటరీ టికెట్ ఆ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడి.. ఆర్థిక కష్టాలు తీర్చింది.