వాలెంటైన్స్ డే వస్తుందంటే మగ లవర్లు ఫ్లవర్లు, గిఫ్టులతో ఆడ లవర్లను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమైపోతారు. అయితే ఈ వాలెంటైన్స్ డేని కొత్తగా చేసుకోమని సూచిస్తుంది భారత జంతు సంక్షేమ బోర్డు (యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా). ప్రేమికుల దినోత్సవాన్ని కొంచెం విభిన్నంగా చేసుకోవాలని యువకులకు విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ జరుపుకోవాలని యువకులను కోరింది. ఆవును కౌగలించుకుని మూగజీవాల పట్ల ప్రేమను కురిపించాలని సూచించింది. మత్స్య, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన భారత జంతు సంక్షేమ బోర్డు.. ఆవులను ప్రేమించే వారు ఫిబ్రవరి 14న లవర్స్ డే బదులుగా కౌ హగ్ డే జరుపుకోవాలని సూచించింది.
జంతు సంక్షేమ చట్టాలపై చట్టబద్ధమైన సలహాలు ఇచ్చే భారత జంతు సంక్షేమ బోర్డు.. దేశంలో ఉన్న గోప్రేమికులు ఫిబ్రవరి 14న కౌ హగ్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని సూచించింది. వాలంటైన్స్ డే అనేది మన వైదిక సంస్కృతి కాదని, పాశ్చాత్య సంస్కృతి వల్ల వైదిక సాంప్రదాయం కనుమరుగైపోతుందని వెల్లడించింది. ఫిబ్రవరి 14న కౌ హగ్ డేగా జరుపుకోవాలన్న విజ్ఞప్తిని జంతు సంక్షేమ బోర్డు సెక్రటరీ ఎస్కే దత్త ఆమోదించారు. ఆవు ఈ దేశ సంస్కృతికి వెన్నెముక అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అని, మన జీవితాలను నిలబెడుతుందని బోర్డు పేర్కొంది. ఆవు పశు సంపద మరియు జీవ వైవిధ్యాన్ని సూచిస్తుందని తెలిపింది. కామధేను, గోమాతగా పేరొందిన ఈ ఆవు తల్లిలా మనుషులను పోషించే సహజ సిద్ధమైన స్వభావం కలదని.. మానవాళికి అన్ని సంపదలను ఇచ్చే గొప్ప జీవి అని వెల్లడించింది.
Move-over #ValentinesDay, Celebrate February 14 as #CowHugDay says- Animal Welfare Board of India pic.twitter.com/g5Nd8O1Djw
— ashok bagriya (@ashokbagriya10) February 8, 2023
పాశ్చాత్య నాగరికత కారణంగా మన దేశ సంసృతిని, వారసత్వ సంపదను మర్చిపోయేలా చేసిందని బోర్డు తెలిపింది. ఆవుని ఆలింగనం చేసుకుంటే అనేక ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి, విచారం, డిప్రెషన్ వంటి సమస్యలు దూరమవుతాయని పరిశోధనల్లో తేలింది. విదేశీయులు సైతం ఆవులను కౌగిలించుకుంటున్నారు. మరి ఫిబ్రవరి 14న ఆవులను ఆలింగినం చేసుకునే రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన జంతు సంక్షేమ బోర్డు విజ్ఞప్తి చేయడంపై మీ అభిప్రాయమేమిటి? బోర్డు విజ్ఞప్తిని మీరు అంగీకరిస్తారా? వాలంటైన్స్ డే రోజున ఆవుని ఎంతమంది ఆలింగనం చేసుకుంటారు? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.