అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అదానీ స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ కు పాల్పడ్డారని విమర్శలు చేసింది. రుణాలతో పెట్టుబడులు పెట్టి.. మళ్ళీ రుణాలు పొందారని ఆరోపించింది. ఈ ఆరోపణలు రావడంతో అదానీ గ్రూప్ కి చెందిన స్టాక్స్ అన్నీ రెడ్ జోన్ లో ట్రేడ్ అయ్యాయి. దీంతో ఒక్కరోజే రూ. 49 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. తాజాగా అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను ఖండించింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు హేయమనవని.. ఇది ఆదానీపై చేసిన దాడి మాత్రమే కాదని.. భారత్ పైకి చేసిన దాడి అని పేర్కొంది. మన దేశంపైనా, దేశాభివృద్ధిలో భాగమైన సంస్థలపై దురుద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిందని అదానీ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ ది ప్రణాళికతో కూడిన దాడి అని పేర్కొంది. ఈ మేరకు 413 పేజీలతో కూడిన ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థ చేసిన ఆరోపణల్లో అబద్ధం తప్ప నిజం లేదని వెల్లడించింది. తప్పుడు ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను పడగొట్టి.. హిండెన్ బర్గ్ షార్ట్ సెల్లింగ్ ద్వారా లాభాలను పొందాలని చూస్తోందని అదానీ గ్రూప్ విమర్శించింది. తప్పుడు మార్కెట్ ని సృష్టించడం ద్వారా ఆర్థిక లాభాలను పొందేందుకు వీలుగా దురుద్దేశంతో హిండెన్ బర్గ్ ఇలా చేస్తుందని అదానీ గ్రూప్ ప్రకటనలో వెల్లడించింది. ఇది కేవలం ఆదానీ సంస్థలపై చేసిన దాడి కాదని.. దేశం, స్వాతంత్య్రం, సమగ్రత, నాణ్యత, దేశం యొక్క ఆర్థిక వృద్ధిపై చేస్తున్న దాడి అంటూ పేర్కొంది. హిండెన్ బర్గ్ విశ్వసనీయత, నైతికతను అదానీ గ్రూప్ ప్రశ్నించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20 వేల కోట్ల సమీకరణకు చేపట్టిన ఎఫ్పీవో జనవరి 27న శుక్రవారం నాడు ప్రారంభమైంది. ఫిబ్రవరి 1న ఈ ఇష్యూ ముగుస్తుంది.
Adani Group’s detailed response to Hindenburg’s Unsubstantiated Accusationshttps://t.co/byWV8z9q6O
— Adani Group (@AdaniOnline) January 29, 2023
ఈ నేపథ్యంలో హిండెన్ బర్గ్ రిలీజ్ చేసిన రిపోర్టుపై అనుమానం వ్యక్తం చేసింది అదానీ గ్రూప్. హిండెన్ బర్గ్ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు బదులుగా.. అదానీ గ్రూప్ సంస్థల షేర్లలో పెట్టుబడులన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయని తెలిపింది. ఇక మిగిలిన 23 ప్రశ్నల్లో 18 పబ్లిక్ షేర్ హోల్డర్లు, థర్డ్ పార్టీలకు సంబంధించినవని, మిగిలిన 5 ప్రశ్నలు నిరాధారమైనవని వెల్లడించింది. అదానీ గ్రూప్ కంపెనీలన్నీ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటి? హిండెన్ బర్గ్ ఆరోపణల వెనుక హిడెన్ అజెండా ఉందా? అదానీ అన్నట్టు హిండెన్ బర్గ్ ది అదానీ సంస్థలపై దాడిగా భావిస్తున్నారా? లేక దేశంపై చేస్తున్న దాడిగా భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.