పదడుగుల దూరంలో పాము కనిపిస్తే.. పది కిలోమీటర్ల దూరం పారిపోతారు కొందరు. కానీ ఆ పాములే కొందరికి అదృష్ట దేవతలుగా కనిపిస్తాయి. పాములతో చీకటి వ్యాపారం చేసి కోట్లు గడించే ముఠాలు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పాముల విషాన్ని అక్రమంగా.. రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండున్నర కేజీల పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అక్షరాల రూ. 30 కోట్ల వరకు ఉంటుందని అటవీ అధికారులు పేర్కొన్నారు. ఈ పాము విషాన్ని ఫ్రాన్స్ నుంచి చైనా తరలిస్తుండగా అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మహమ్మద్ సరాఫత్ అనే వ్యక్తి పశ్చిమబెంగాల్ లోని ఉత్తర దినాజ్ పుర్ జిల్లాలోని ఖురాయి ప్రాంతంలో నివసించేవాడు. పాములుతో వ్యాపారం చేయడం ఇతడి వృత్తి. పాములను, పాముల విషాన్ని అంతర్జాతీయంగా ఎగుమతులు, దిగుమతులు చేయడంలో సరాఫత్ సిద్దహస్తుడు. అందులో భాగంగానే ఫ్రాన్స్ నుంచి చైనాకు పాము విషాన్ని రవాణా చేసే పనిని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ లోని ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు జరిపారు. తనిఖీల్లో భాగంగా పాము విషాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న మహమ్మద్ సరాఫత్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే సరాఫత్ నుంచి రెండున్న కేజీల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. “ఈ విషం ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఇండియాలోకి వచ్చిందని, ఈ విషాన్ని సరాఫత్ నేపాల్ దేశంలో వేరే ముఠాకు అప్పగించాలి.. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ విషం చైనాకు తీసుకెళ్లాలి” అన్నది వారి వ్యూహంగా సరాఫత్ వెల్లడించాడు. నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో శనివారం రాత్రి అధికారులు కాపు కాసి సోదాలు నిర్వహించడంతో ఈ బడ్డారం బయటపడింది.