బట్టలు వేసుకోకుండా మీరు ఎప్పుడైనా బయట తిరిగారా? అలా ఎలా కుదురుతుంది.. మేం బాత్రూంలో అయినా సరే బట్టలేసుకునే స్నానం చేస్తాం. అలాంటిది బయటకు రావడామా.. అది లైఫ్ లో జరగని పని అని అంటారా? సరే మీ ఇష్టం. కానీ ఈ కుర్రాడు మాత్రం అలా కాదు. బట్టలేసుకుండానే దర్జాగా బయట తిరిగేస్తున్నాడు. మరీ పూర్తిగా ఒంటిపై గుడ్డల్లేకపోతే బాగోదని.. అండర్ వేర్ వేసుకుని రోజూ కాలేజీకి వెళ్తున్నారు. ఫ్రెండ్స్, టీచర్స్ అందరికీ అతడు అలవాటు అయిపోయాడు. మనకి మాత్రం ఇది కళ్లప్పగించి చదివేంత వింత!
ఇక వివరాల్లోకి వెళ్తే.. మన కార్టూన్స్ లో మోగ్లీ అనే క్యారెక్టర్ ఉంటుంది. అడవిలో పుట్టి పెరగడంతో బట్టలు వేసుకోవడం అలవాటు ఉండదు. కేవలం నడుముకు చిన్న వస్త్రం కట్టుకుని ఉంటాడు. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో గానీ.. మధ్యప్రదేశ్ బడ్ వానీకి చెందిన కన్నయ్య అచ్చం మోగ్లీలానే ప్రవర్తిస్తున్నాడు. చిన్పప్పటి నుంచీ కూడా మనోడికి బట్టలంటే చెడ్డ చిరాకు. ఎవరైనా బట్టలు వేసుకోమని చెబితే చాలు వాళ్లతో మాట్లాడటం మానేసేవాడు. స్కూల్ కి వెళ్లే వయసు వచ్చేసరికి.. తల్లిదండ్రులు కన్నయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కన్నయ్య పట్టించుకోలేదు.
‘స్కూల్ కి వెళ్లేముందు కన్నయ్యకి బట్టలు వేయాలని ప్రయత్నించాను. కానీ వాటిని తీసి పక్కన పడేసేవాడు. గట్టిగా చెబుదామని అనుకుంటే.. బట్టలన్నీ చింపి పడేసేవాడు’ అని కన్నయ్య తల్లి చెప్పారు. ఇక ఎలిమెంటరీ తర్వాత హైస్కూల్ చేరిన తర్వాతైనా సరే కన్నయ్య మారుతాడనుకున్నారు. కానీ అది జరగలేదు. టీచర్స్ బట్టలు కొనిచ్చినా సరే.. కన్నయ్య వాటిని ఒక్కసారి కూడా ముట్టుకోలేదు. ఇక్కడ వరకు బాగానే సాగింది. కానీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్తే.. వాళ్లు కన్నయ్యని చేర్చుకోమని చెప్పారు. చివరకు కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో స్కూల్లో జాయిన్ అయ్యాడు.
అయితే కన్నయ్య చదువులో టాపర్ కావడం, క్రమశిక్షణకు తోడు స్పోర్ట్స్ లో మంచి నైపుణ్యం ప్రదర్శించేవాడు. ఇలా మంచి స్టూడెంట్ అనిపించుకోవడం వల్ల టీచర్స్ కూడా వస్త్రధారణ గురించి అభ్యంతరం చెప్పేవారు కాదు. ఇక కాలేజీలో చేరితో బట్టలు వేసుకోవాల్సి వస్తుందేమోనని.. చదువు ఆపేస్తానని అన్నాడు. టీచర్స్ చాలా శ్రమపడి, అతడిని ఒప్పించి కాలేజీలో చేర్పించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న కన్నయ్య.. ఓన్లీ అండర్ వేర్ మాత్రమే ధరించి క్లాసులకు హాజరవుతున్నాడు. ఫ్రెండ్స్ కూడా నార్మల్ గానే ఉంటున్నారు. ఇక కుటుంబ సభ్యులైతే.. చదువు పూర్తయిన తర్వాతైనా సరే కన్నయ్య బట్టలు వేసుకుంటాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాలేజీ కుర్రాడు.. కేవలం అండర్ వేర్ మాత్రమే వేసుకుని క్లాసులకు అటెండ్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.