ఇటీవల కాలంలో తల్లిదండ్రులు కొడుతున్నారనో, తిండి పెట్టడం లేదనో.. చిన్నారులు పోలీస్ స్టేషన్ల బాట పడుతున్న సందర్భాలు అనేకం జరుగుతున్నాయి. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం కాదు కదా! వారిని చూస్తేనే భయపడేవారు. కానీ, ఇప్పుడు పిల్లలు అలా ఉండట్లేరు. బడికి వెళ్లినంత సులభంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. అక్కడకి వెళ్ళాక వారి వచ్చిరాని మాటలతో.. ‘అమ్మను అరెస్ట్ చేయాలి/ నాన్నను చేయాలి’ అంటూ పోలీసులనే ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ వార్త. 3 ఏళ్ల బాలుడు అమ్మ కొట్టిందంటూ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఏదైనా నేరం చూసినా/తమకు ఏదైనా అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇద్దామా? వద్దా? అని ఆలోచించే రోజులివి. అలా వెళ్తే ఎక్కడ మన మీదనే రుద్దుతారనే భయం ఒకటైతే, పోతే పోయిందిలే అనుకునే వారు మరికొందరు. అయితే ప్రస్తుత జనరేషన్ పిల్లలు అలా ఉండట్లేరు. బయట వాళ్లు కాదు కదా.. ఇంట్లో వాళ్లు దండించినా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేసేస్తున్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక 3 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన తల్లిపై ఇలానే పిర్యాదు చేశాడు. తన తల్లితనను కొట్టిందని, తన క్యాండీలు దొంగిలించిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడున్న మహిళా పోలీస్ అధికారి ఆ బాలుడి చెప్పినట్లుగానే అన్నీ రాసుకుంది.
వీడియోలో బాలుడు చెప్పినదాన్ని బట్టి.. “తన తల్లి తనను చెంపదెబ్బ కొట్టిందని, తన క్యాండీలు మరియు చాక్లెట్‌లను దొంగిలించినందున తల్లిని లాక్కెళ్లమని మహిళా పోలీసు అధికారిని కోరుతుండడం మనం వినవచ్చు. సదరు పోలీసు అధికారి తల్లి పేరు ఏంటి? అని అడిగినప్పుడు.. అతను కేవలం “మమ్మీ” అని చెప్తున్నాడు”. ఇక్కడ విడ్డూరం ఏమిటంటే.. మూడేళ్ళ బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు సమస్యను వివరించి న్యాయం చేయమని అడుగుతుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే.. కంప్లైంట్ తీసుకుంటున్నట్లుగా అతను చెప్పిన విషయాల్ని ఓ పేపర్‌పై రాసుకొచ్చిన మహిళా సబ్ ఇన్స్‌పెక్టర్ పై కూడా ప్రశంశలు కురిపిస్తున్నారు.