Viral Video: ఓ మహిళా కళాశాలలోకి అక్రమంగా ప్రవేశించిన కొందరు పోకిరీలు హల్‌చల్ చేశారు. గేటు, గోడలు దూకి కాలేజ్‌లోకి వెళ్లిన వారు అలజడి సృష్టించారు. విద్యార్థినులను, ఉపాధ్యాయులను ఇబ్బందికి గురిచేశారు. క్లాస్ రూములు తిరుగుతూ.. గట్టిగా అరుస్తూ.. కాలేజ్‌లోని సామాగ్రిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం చోటుచేసుకుంది. కాలేజ్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని ఆల్ ఉమెన్ మిరండ హౌస్ కాలేజ్‌లో ఆదివారం దివాళీ మేలా జరిగింది. ఈ మేళా ప్రారంభమైన తర్వాత గేట్ మూసేశారు. మేళా కోసం కాలేజ్ దగ్గరకు వచ్చిన కొందరు యువకులు గేటు మూసి ఉండటంతో గేటు ఎక్కిదూకటం మొదలుపెట్టారు. అంతేకాదు! కాలేజ్ గోడల చుట్టూ చేరి, గోడలు దూకటం మొదలుపెట్టారు. ఇది గమనించిన కాలేజ్ యజమాన్యం వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
అయితే ఆ యువకులు వారి మాటలు లెక్కపెట్టలేదు. యజమాన్యంపైనే తిరగబడ్డారు. గట్టిగా అరుస్తూ క్లాస్ రూమ్‌లలోకి అడుగుపెట్టారు. క్లాస్ రూము డోరులపై గట్టిగా కొట్టారు. వారించిన ఉపాధ్యాయులపైనా తిరగబడ్డారు. విద్యార్థినులపైనా ఆ యువకులు తమ ప్రతాపాన్ని చూపించారు. వారిని భయాందోళనకు గురిచేశారు. కాలేజ్‌లోని సామాగ్రిని సైతం ధ్వంసం చేయటానికి ప్రయత్నించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. యువకులు గేటు దూకి కాలేజ్‌లోకి ప్రవేశించటం.. చెట్టు ఎక్కి గోడ దూకటం కనిపిస్తోంది.