గత కొంత కాలంగా చిన్న సినిమాలుగా వచ్చి.. భారీ హిట్ కొడుతున్న కన్నడ సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గతంలో కేజీఎఫ్ చాప్టర్ 1, చార్లి 777 సినిమాలు ఇలానే రికార్డులు.. సృష్టించగా.. తాజాగా ఆ జాబితాలో కాంతార సినిమా చేరింది. ఒక్క కన్నడ ఇండస్ట్రీలోనే కాక.. దక్షిణాది మొత్తం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతోంది. ఈ సినిమాకు కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించాడు.. సప్తమి గౌడ, కిశోర్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. సెప్టెంబర్ 30న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. అలానే సామాన్యులు మొదలు సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా కాంతారా సినిమా కేజీఎఫ్ 2, ట్రిపుల్ ఆర్ రికార్డులను తిరగరాసింది. రేటింగ్ విషయంలో ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలను వెనక్కి నెట్టింది కాంతార సినిమా. ఐఎండీబీలో కేజీఎఫ్ 2 మూవీకి 8.4, ఆర్ఆర్ఆర్ సినిమాకు 8 రేటింగ్ ఉండగా కాంతార.. వీటిని వెనక్కు నెట్టి అత్యధికంగా 9.6 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా కాంతార నిలిచింది. మరోవైపు రోజురోజుకీ ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇతర ఇండస్ట్రీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఈ క్రమంలో కాంతార సినిమాను తెలుగు, తమిళ్, హిందీలో డబ్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే అక్టోబర్ 14న అంటే శుక్రవారమే కాంతార హిందీలో రిలీజ్ కాగా, తమిళం అండ్ తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ అవుతుంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక కాంతార మూవీ రేటింగ్‌తో పాటు వసూళ్ల విషయంలో కూడా అలానే దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 90 కోట్లు వసూళ్ళు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ క్రేజ్ ఇలానే కొనసాగితే.. ఈ వారం చివరి నాటికి కాంతార మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క కన్నడ రాష్ట్రంలోనే ఈ సినిమా దాదాపు 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందంటే, ఆ సినిమాకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో త్వరలోనే తెలుస్తుంది.