మోసపోయేవాళ్లే ఉండాలే గానీ మోసం చేసే వాళ్లకి కరువా చెప్పండి. డబ్బులు సంపాదించడం అంత వీజీ కాదు అని ఓ పెద్ద మనిషి చెప్పినా గానీ ఎవరో ఏంటో తెలియని వారిని నమ్మి వేలు, లక్షలు, కోట్లు మోసపోతారు. ఈ భూమ్మీద మనుషుల్ని ఈజీగా మోసం చేయగలిగే దారి ఏదైనా ఉందంటే అది సినిమానే. సినిమాలో అవకాశం అనో, పెట్టుబడులు అనో ఏదో కారణం చెప్పి అమాయకుల నుంచి భారీగా డబ్బులు లాగుతారు. ఈ మోసాలు చేసే వాళ్ళు కూడా ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న వారినే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే డబ్బు ఆశ ఉండేది మిడిల్ క్లాస్ వాళ్ళకే కదా. మిమ్మల్ని పైకి తీసుకొస్తానని చెప్పి నమ్మించి చివరికి రోడ్డు పైకి తీసుకొస్తారు. ఇలాంటి సంఘటనలు తరచూ మీడియాలో వింటున్నా గానీ మనిషి బుద్ధి మారదు.
గుడ్డిగా నమ్మేసి ఉన్నదంతా ఊడ్చి పెట్టేస్తారు, లేదంటే అప్పు చేసి మొత్తం మోసగాళ్ళకే సమర్పించుకుంటారు. ఇంకేముంది ఐపాయ్. తాజాగా ఓ కుటుంబం సినిమాల్లో లాభాలు చూపిస్తామని చెప్పి సినిమా చూపించేసింది. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్ లు కలిసి రూ. 6 కోట్ల వరకూ మోసాలకు పాల్పడ్డారు. సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడుల పేరుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను, వారి బంధువులను టార్గెట్ చేసి ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, వెంకీ మామ, నాంది వంటి సినిమాల్లో పెట్టుబడులు పెడితే.. వచ్చిన లాభాల్లో అధిక వాటా ఇస్తామని నమ్మించారు. అది నమ్మిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు భారీగానే డబ్బులు పెట్టుబడి పెట్టారు.
అయితే సినిమాలు రిలీజై, హిట్ అయిపోయాయి కూడా. ఏటి లాభాలన్నారు, వాటా ఇస్తామన్నారు, ఇవ్వడం కనబడట్లేదని అనుమానం వచ్చి.. అంజమ్మ, ఉమా శంకర్ లను నిలదీశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగారు. అయితే తమకు మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసంటూ.. వారి పేర్లు చెప్పి బాధితులను బెదిరించారు. దీంతో బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. సినిమాల పేరుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో పరిచయం పెంచుకోవడం, మెల్లగా వారి కుటుంబాలకు క్లోజ్ అవ్వడం, పెట్టుబడులు పెట్టించడం, వారితో లోన్లు పెట్టించడం, మిడిల్ క్లాస్ అమ్మాయిలని టార్గెట్ చేయడం ఇలా చాలా గత్తర పనులు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అక్కా తమ్ముడు అంటూ తమ కుటుంబంలోకి వచ్చారని, ఆర్ధిక సమస్యలని పరిష్కరిస్తామని, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్పి రోడ్డు పైకి తెచ్చారని బాధితులు వాపోతున్నారు. కొంగర అంజమ్మ చౌదరి, కొంగర హేమ, కొంగర హేమంత్, నాగ ఉమా శంకర్ మొత్తం నలుగురు తమ జీవితాల్లోకి వచ్చి తమని చీకట్లోకి నెట్టేశారని ఆవేదన చెందుతున్నారు. తమ డబ్బు వెనక్కి ఇప్పించాలని ఆందోళన చేస్తున్నారు. అల వైకుంఠపురం సినిమాకి పెట్టుబడిగా కోటిన్నర తీసుకున్నారని.. లాభాల్లో 50, 60 శాతం వచ్చినట్టు చెప్పారని అన్నారు. ప్రూఫ్ అడిగితే.. థర్డ్ పార్టీ అని చెప్పి కుదరదని మాట దాటేసినట్టు బాధితులు తెలిపారు. సరిగ్గా అప్పుడే లాక్ డౌన్ పెట్టడంతో ఇప్పుడు ఇవ్వడం కుదరదని తప్పించుకున్నారని అన్నారు.
ఇలా ఒకరిద్దరిని కాదు చాలా మందిని మోసం చేశారు. మొదట తక్కువ అమౌంట్ పెట్టుబడి పెట్టించి.. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టకపోతే ముందు పెట్టినవి కూడా రావని బ్లాక్ మెయిల్ చేసేవారట. అల వైకుంఠపురం, ఆర్ఆర్ఆర్ సినిమాలకి థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్లమని, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని చెప్పి.. కోట్లలో డబ్బులు గుంజారు. ఇంకో వ్యక్తితో కోటి 75 లక్షలు పెట్టుబడి పెట్టించి.. ఇవ్వకపోగా అతని మీద దాడికి దిగారు. ఇలా ఈ కేటుగాళ్లు సినిమా పేరు చెప్పుకుని కోట్లలో సొమ్ము చేసుకుని బతికేస్తున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిని విచారిస్తున్నారు.