Archana Nag: మంచి, చెడ్డలు ఆలోచించే వారికి మాత్రమే హద్దులుంటాయి. ఒక్కసారి మంచి, చెడ్డలను పక్కన పెట్టి హద్దులు దాటితే.. కోరుకున్న దానికోసం బరితెగిస్తే.. జీవితంలో కోరుకున్న ప్రతీదాన్ని సాధించొచ్చు. కానీ, చేసే పని చట్ట వ్యతిరేకం అయితే తిప్పలు తప్పవు. అప్పటి వరకు సంపాదించిన కోట్లు అండగా నిలవవు. చేసిన చెడ్డ పనులే కాళ్ల కింద ఊబిలా మారి లోపలికి గుంజేస్తాయి. ఒడిస్సాకు చెందిన అర్చన నాగ్ విషయంలోనూ అదే జరిగింది. కూటికి గతి లేని స్థితి నుంచి వచ్చిన ఆమె కోట్లు సంపాదించాలనుకుంది. అందుకు అడ్డదారిని ఎంచుకుంది. అందం ఆమె పెట్టుబడిగా మారింది. తన అందాన్ని ఎరగా వేసి పెద్దింటి వారిని ఆకర్షించింది. వారితో గడిపిన దృశ్యాలను వీడియోలుగా తీసి బెదిరింపులకు దిగింది. చివరకు పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కబెడుతోంది.
మారుమూల గ్రామం నుంచి నగరానికి..
అర్చన నాగ్ ఒడిస్సాలోని కాలాకహండి జిల్లాలోని లంజిఘర్‌లో జన్మించింది. తల్లి కెసింగ పట్టణంలో కూలీ పనిచేసేది. అర్చన కూడా తల్లితో పాటే పెరిగింది. 2015లో మొదటి సారిగా భువనేశ్వర్ నగరానికి వచ్చింది. నగరానికి వచ్చిన కొత్తలో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో అర్చన పని చేసింది. ఆ తర్వాత కొన్ని నెలలకు బ్యూటీ పార్లర్‌లో పని చేయటం మొదలుపెట్టింది. అక్కడే జగబంధు చంద్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం అయింది. ఇద్దరూ కలిసి బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచారం నడిపేవారు. 2018లో అర్చన, జగబంధు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
భర్తే బ్రోకర్.. డబ్బున్నోళ్లకు ఎర..
జగబంధు చందుకు సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం ఉంది. అక్కడినుంచే అతడు వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించిన ప్లాను వేసేవాడు. బాగా డబ్బున్న వారిని ఆకర్షించేవాడు. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ బిల్డర్స్, వ్యాపార వేత్తలు ఇంకా ఎంతో మందిని తమ కంపెనీకి రప్పించేవాడు. అర్చన కూడా డబ్బున్న వారితో స్నేహం చేసుకునేది. వారికి అమ్మాయిలను ఎర వేసేది. బ్యూటీ పార్లర్‌లోనే అమ్మాయిలతో వారికి ఏకాంతాన్ని కలిగించేది. వారు అమ్మాయిలతో ఏకాంతంగా ఉండగా.. ఫొటోలు, వీడియోలు తీసేది. తర్వాత ఆ వీడియోలు, ఫొటోలతో వారిని బెదిరించేది. భారీ మొత్తంలో డబ్బు గుంజేది.
5 ఏళ్లలో 30 కోట్ల సంపాదన.. పాపం పండి..
ప్రైవేట్ వీడియోలతో డబ్బున్న వారిని బెదిరించి భారీగా డబ్బులు గుంజేది అర్చన. అలా చాలా మంది నుంచి డబ్బులు గుంజింది. ఆనతి కాలంలోనే కోట్లు సంపాదించింది. ఓ ఖరీదైన పలాటియల్ ఇళ్లు, లగ్జరీ కార్లు, ఖరీదైన కుక్కలు, గుర్రాలను కొనుక్కుంది. భార్యాభర్తలు ఇద్దరూ 2018నుంచి 2022 మధ్య కాలంలో 30 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సంపాదించారు. పెరుగుట విరుగుట కొరకే అని. ఆమె బెదిరింపులకు ముగింపు కాలం వచ్చింది. అర్చన ఓ చిత్ర నిర్మాతను బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
తాను వేరే అమ్మాయిలతో ఉన్న ఫొటోలు చూపించి అర్చన 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఓ యువతి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చన తనను వ్యభిచార రాకెట్ కోసం వాడుకుంటోందని పేర్కొంది. దీంతో అక్టోబర్ 6న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అర్చన క్రైం కథ దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత శ్రీధర్ మార్తా ఆమె జీవిత కథ ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక, అర్చన క్రైం కథపై భుబనేశ్వర్ బీజేపీ నేత బాబు సింగ్ మాట్లాడుతూ.. 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది మంత్రులు అర్చన నెట్‌వర్క్‌లో ఉన్నారని ఆరోపించాడు.