ఆవు పేడ వల్ల ఉపయోగం లేదని మన వాళ్ళు కొంతమంది అంటుంటే.. ఆ ఆవు పేడనే ఇంధనంగా మార్చి ట్రాక్టర్లను తయారు చేసింది విదేశీ కంపెనీ. వ్యవసాయ భూముల్లో దున్నడానికి ట్రాక్టర్ల అవసరం ఎంతగానో ఉంది. దుక్కి దున్నడం, దమ్ము చేయడం వంటి పనులకు ఇప్పుడందరూ ట్రాక్టర్లనే వాడుతున్నారు. ఒకప్పుడంటే ఎద్దులని ఉపయోగించేవారు. టెక్నాలజీ పెరిగాక అందరూ ట్రాక్టర్లనే వాడుతున్నారు. అయితే పెరిగిపోతున్న చమురు ధరల కారణంగా ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడం రైతులకు పెద్ద సమస్యగా తయారైంది. ట్రాక్టర్ రెంట్ కి, పెట్రోల్, డీజిల్ కి, కూలీలకు, ఎరువులకు ఇలా రకరకాల ఖర్చులు పెరిగిపోతుండడంతో రైతులకు పెద్దగా ఏం మిగలడం లేదు.
దీంతో రైతులకు ప్రధాన సమస్య అయినటువంటి పెట్రోల్/డీజిల్ కి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. సొంత పొలాల్లో, పశువుల దొడ్లలో దొరికే ఆవు పేడతోనే ట్రాక్టర్ నడిచేలా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ప్రపంచంలోనే ఆవు పేడతో నడిచే తొలి ట్రాక్టర్ ని ఇటలీ దేశానికి చెందిన ‘న్యూ హోలాండ్ అగ్రికల్చర్’ అనే వ్యవసాయ యంత్రాలను తయారు చేసే కంపెనీ తయారు చేసింది. లిక్విడ్ మీథేన్ గ్యాస్ తో నడిచే టి7 మోడల్ ట్రాక్టర్ ని రైతుల కోసం తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. వ్యవసాయ క్షేత్రంలో దొరికే ఆవు పేడతో 270 బీహెచ్పీ సామర్థ్యంతో ట్రాక్టర్ నడుస్తుందని.. స్టాండర్డ్ డీజిల్ తో నడిచే ట్రాక్టర్ల కంటే అద్భుతంగా నడుస్తుందని కంపెనీ వెల్లడించింది.
కనీసం 100 ఆవుల మంద నుంచి సేకరించిన పేడను బయో మీథేన్ స్టోరేజ్ యూనిట్స్ లో నిల్వ చేస్తారు. ఫ్యుజిటివ్ మీథేన్ గా పిలవబడే గ్యాస్.. తక్కువ ఉద్గార ఇంధనంగా కంప్రెస్ అవుతుంది. దీని కోసం ఒక క్రయోజెనిక్ ట్యాంక్ ని ట్రాక్టర్ మీద ఏర్పాటు చేస్తారు. ఇది 162 డిగ్రీల ఉష్ణోగ్రతతో బయో మీథేన్ గ్యాస్ ను.. ద్రవ రూపంలో ఉండేలా చేస్తుంది. దీని వల్ల ట్రాక్టర్ డీజిల్ వాహనం కంటే ఎక్కువ సమర్థవంతంగా పని చేయడమే కాకుండా.. బయో మీథేన్ గ్యాస్ ని ఆదా చేస్తుంది.
ఆవు పేడతో నడిచే ఈ మీథేన్ ట్రాక్టర్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఈ ట్రాక్టర్ భారత్ లో కూడా అడుగుపెడితే.. ప్రభుత్వ సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తే వారి పంట పండుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ వస్తే రైతులకు ఇంతకు మించిన ఆనందం ఉండదు. మరి ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ ని తయారు చేస్తున్న కంపెనీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.