కొన్ని రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి.. వయసు సుమారు 60 ఏళ్ల వరకు ఉంటుందేమో. ఓ మెడికల్ షాప్‌కి వెళ్లాడు. లోపలంతా కలియజూశాడు. అక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి ఉన్నాయి. వాటి మీద దొంగతనం చేయకూడదు.. ఒకవేళ ఎవరైనా అలాంటి నేరానికి పాల్పడితే.. కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామనిరాసి ఉంది. అంతేకాదు జైలుకు కూడా పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. వాటిని చూసిన పెద్ద మనిషి.. సిబ్బందికి కనిపించేలా.. వారి ముందే మూడు సబ్బులు తీసుకుని బయటకు వెళ్లాడు. సెక్యూరిటీ వాళ్లు అతడిని ఆపి.. దొంగతనం చేసినందకు చెడామడా తిట్టారు. వృద్ధుడి పరిస్థితి గమనించిన ఓ వ్యక్తి సబ్బుల బిల్లు తాను కడతాను.. అతడిని వదిలేయండి చెప్పాడు. కానీ వృద్ధుడు ఒప్పుకోలేదు. తనను పోలీసులకు అప్పగించమని కోరాడు. చిన్నదొంగతనమే కదా.. పర్లేదు వెళ్లండి అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చేసేదేం లేక పోలీసులకు కాల్ చేశారు. ఇక అతడు చెప్పిన మాటలు విని పోలీసులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఆ వివరాలు..
ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. ఫిచెట్ అనే 60 ఏళ్ల వృద్ధుడు చోన్‌బురి ప్రావిన్స్‌లోని ఒక మెడికల్‌షాప్‌కి వెళ్లి.. సబ్బులు దొంతగతనం చేశాడు. సెక్యూరిటీ వారు పట్టుకుని.. చివాట్లు పెట్టారు. ఓ వ్యక్తి ఫిచెట్ పరిస్థితికి జాలిపడి ఆ డబ్బులు తాను చెల్లిస్తానని తెలిపాడు. కానీ ఫిచెట్ ఒప్పుకోలేదు. తాను దొంగతనం చేశాను కనుక.. పోలీస్ స్టేషన్‌కు పంపాల్సిదే అని పట్టుబట్టాడు. చేసేదేం లేక సదరు మెడికల్ షాప్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
“ఏం జరిగింది.. ఎందుకిలా జైలుకెళ్లాలని పట్టుబడుతున్నావ్’’ అని పోలీసులు ఫిచెట్‌ని ప్రశ్నించారు. అప్పుడు ఫిచెట్ చెప్పిన మాటలు విన్నవారంతా తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఆకలి ఎలాంటి పనినై చేయిస్తుంది కదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫిచెట్ మాట్లాడుతూ.. ‘‘నా వయసు 60 ఏళ్లు. కష్టపడి పని చేసే సత్తువ లేదు.. కానీ ఇవేం ఆకలికి తెలియవు కదా.. జానేడు పొట్ట నింపుకోవడం కోసం.. నా జేబులో చిల్లి గవ్వ కూడా లేదు.. ఒక్కరోజు అంటే ఎవరైనా జాలి తలిచి సాయం చేస్తారేమో. కానీ ప్రతి రోజు ఇదే బాధ. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలితో అలమటించి చనిపోవడం ఖాయం. అదే జైలుకు వెళ్తే.. నాకు మూడు పూటలా తిండి దొరుకుతుంది. అందుకే దొంగతనం చేశాను.. నన్ను అరెస్టు చేయండి ప్లీజ్’’ అని బతిమిలాడాడు.
ఫిచెట్ మాటలు విన్న ప్రజలే కాక పోలీసులు సైతం తల్లడిల్లారు. ఆ వృద్ధుడి వేదన వారిని కదిలించింది. అతడి దుస్థితిని తలుచుకుని కన్నీరు పెట్టకున్నారు. కానీ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఎక్కడ చూసిన ఇలాంటి వ్యధాభరిత పరిస్థితులే కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్భణం పెరగడంతో థాయిలాండ్ దేశం తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుంది. అక్కడి దుర్భర పరిస్థితులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఫిచెట్. ఇక అతడి దుర్భర స్థితి గురించి తెలుసుకున్న నెటిజనులు.. ఎంత దారుణం ఇదీ.. ఒక మనిషి తన జీవితంలో అరవై ఏళ్లపాటు కష్టపడినా.. చివరకు జీవిత చరమాంకంలో తినడానికి తిండికూడా లేని దుర్భర స్థితిలో గడపాల్సి రావడం ఎంత ఘోరం. సైంటిస్టులు ఆకలి తీర్చడం కోసం ఏదైనా చవకైన మందు కనిపెడితే ఎంత బాగుటుంది అంటున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.