Crime News: మద్యం మత్తులో ఓ వేశ్య దారుణానికి ఒడిగట్టింది. బస్సులో ప్రయాణం చేస్తుండగా ఓ టూరిస్టుపై దాడి చేసింది. అతడి చెవిని అమాంతం కొరికి, మింగేసింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లోని పటాయాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. థాయ్‌లాండ్, పటాయాకు చెందిన 25 ఏళ్ల కన్నికా కమతాన్ పడుపు వృత్తితో జీవనం కొనసాగిస్తోంది. గత శనివారం ఫుల్లుగా మద్యం సేవించి ఓపెన్ బ్యాక్ బస్ ఎక్కింది. ఓ టూరిస్ట్ పక్కకు వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత తన పళ్లతో ఠక్కున టూరిస్ట్ చెవి కొరికింది. చెవి కింది భాగాన్ని చీల్చి, మింగేసింది. టూరిస్ట్ బాధతో అల్లాడిపోయాడు. గట్టిగా చావు కేకపెట్టాడు.
ఆ దృశ్యం చూసిన మిగిలిన ప్రయాణికులు భయపడిపోయారు. తోటి ప్రయాణికుల్లో ఒకరు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే తప్పించుకోవాలని కన్నికా ప్రయత్నించింది. కానీ, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, సదరు టూరిస్ట్ చెవి కింది భాగం బాగా తెగటంతో విపరీతమైన రక్తస్రావం అవ్వసాగింది. పోలీసులు రక్తస్రావం అవ్వకుండా బట్టను చుట్టి బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీస్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ సాయిజయ్ కమ్‌చౌలా మాట్లాడుతూ.. ‘‘ సంఘటన జరిగిన తర్వాత నిందితురాలిని ఓ పోలీస్ అదుపులోకి తీసుకున్నాడు. అయితే, ఆ పోలీస్‌పై కూడా ఆమె దాడి చేసింది. కాలితో కొట్టి పారిపోవటానికి ప్రయత్నించింది. దీంతో మరికొంత మంది పోలీసులు అక్కడికి వెళ్లారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరుస్తాము. చాలా మంది సాక్షులు, బాధితుడు ఆమెను అరెస్ట్ చేయాలని, కోర్టుకు పంపాలని కోరారు’’ అని తెలిపారు. అయితే, కన్నికా ఎందుకు ఆ టూరిస్ట్‌పై దాడి చేసిందో మాత్రం తెలియరాలేదు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.