దిగ్గజ సంస్థ గూగుల్.. 12 వేల మంది టెకీలను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామన్న ఆనందం ఒక్కసారిగా దూరమైంది. వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో ఉద్యోగం కోల్పోవడంపై భావోద్వేగభరిత పోస్టులు షేర్ చేస్తున్నారు. 12 వేల మందిలో 8 నెలల గర్భిణీ కూడా ఉంది. ప్రసూతికి ఒక వారం సమయం ఉందనగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం కోల్పోవడంతో ఆమె ఎమోషనల్ అవుతూ పోస్ట్ షేర్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలా ఉద్యోగం కోల్పోయిన వారు ఒక్కొక్కరుగా తమ బాధలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. తాజాగా మరో ఉద్యోగి ఉద్యోగం నుంచి తొలగించడంపై భావోద్వేగానికి గురయ్యారు.
శాన్ ఫ్రాన్సిస్కో గూగుల్ కార్యాలయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన టామీ యార్క్ అనే ఉద్యోగి.. తల్లి చనిపోయిందని ఊరు వెళ్లి వచ్చేలోపు ఉద్యోగం కోల్పోయాడు. గత నెల డిసెంబర్ లో టామీ తల్లి మరణించగా.. సెలవు మీద ఇంటికి వెళ్లారు. తన తల్లి చనిపోయిందని సెలవు తీసుకుని ఊరు వెళ్లిన టామీకి.. నాలుగు రోజుల తర్వాత తెలిసింది ఉద్యోగం పోయిందన్న విషయం. తల్లి మరణాన్ని దిగమింగుకుని ఆఫీస్ కి వెళ్లాల్సి ఉందనగా.. గూగుల్ తనను తొలగించిందన్న వార్త తెలిసి మరింత కృంగిపోయాడు. తల్లి మరణంతో కృంగిపోతున్న టామీని.. గూగుల్ మరింత కృంగదీసింది. క్యాన్సర్ కారణంగా తన తల్లి మృతి చెందిందని.. మాతృవియోగం సెలవులో ఉన్న తనకు 4 రోజుల తర్వాత గూగుల్ సంస్థలో ఉద్యోగం పోయిందన్న వార్త వినాల్సి వచ్చిందని వెల్లడించారు.
గూగుల్ సంస్థ వాళ్ళని తొలగించింది, వీళ్ళని తొలగించిందన్న వార్తలు విన్న తనకు.. తనే వార్త అవుతానని అనుకోలేదని బాధపడ్డారు. తల్లి మరణంతో కింద పడిపోయిన తనను లేపి.. చెంప మీద లాగి కొట్టినట్లు అనిపించిందని అన్నారు. టామీ యార్క్ డిసెంబర్ 2021లో గూగుల్ సంస్థలో చేరారు. అయితే ఫిబ్రవరి 2022లో తన తల్లికి స్టేజ్ 4 పాంక్రటిక్ క్యాన్సర్ అని తెలిసింది. ఆ సమయంలో టామీ కీలకమైన ప్రాజెక్ట్ లో ఉన్నాడు. ఒక పక్క తల్లిని కాపాడుకోవాలి, హాస్పిటల్స్ కి తీసుకెళ్ళాలి, మరోపక్క జీతమిచ్చే ఉద్యోగానికి న్యాయం చేయాలి. తల్లి చనిపోయే కొన్ని నెలల పాటు తాను నరకం అనుభవించానని అన్నారు. ఉద్యోగానికి, తల్లికి మధ్య గిలగిలలాడిపోయానని.. అయినప్పటికీ ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించానని అన్నారు.
అలానే అమ్మను కూడా కాపాడుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించాను గానీ అమ్మ దక్కలేదని భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు ఎన్నిసార్లయినా వస్తాయి, కానీ తల్లిదండ్రులు ఒకసారే మరణిస్తారు. ఆ సమయంలో కొడుకు ఎక్కడున్నాడన్నదే ముఖ్యం.. తాను తన సమయాన్ని తన తల్లి కోసం కేటాయించానని, తల్లి కోసం వినియోగించానని అన్నారు. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేదీ ఉండదని అన్నారు. లాస్ట్ మినిట్ లో తల్లితో ఉండగలిగినందుకు సంతోషంగా ఉందని.. తల్లిని కడసారిగా చూసుకున్నాను, ఈ జీవితానికి ఇది చాలని అన్నారు. మరి తల్లి మరణించిన బాధని దిగమింగుకుని.. మళ్ళీ పనిలో నిమగ్నమవ్వాలనుకున్న టామీని గూగుల్ తొలగించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.