వివాహం అంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక అని భావించేవారు గతంలో. అయితే మారుతున్న కాలంతో పాటు.. ఆచారవ్యవహారాలు, సంప్రదాయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నచ్చితే కలిసి ఉంటున్నారు.. లేదంటే విడాకులు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకుని ఒంటరి జీవితం గడిపేవారిలో.. కొందరు పిల్లలు ఎదిగిన తర్వాత కూడా మనసుకు నచ్చిన తోడు దొరికితే.. మళ్లీ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక ఇవే కాక ప్రస్తుతం ఒకరికి తెలియకుండా ఒకరిని వరుసగా పెళ్లి చేసుకుంటున్న నిత్య పెళ్లి కొడుకులు, పెళ్లి కుమార్తెల వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త చాలా ప్రత్యేకమైనది. ఓ వ్యక్తి 43 ఏళ్లలో ఏకంగా 53 మందిని వివాహం చేసుకున్నాడు. కొన్ని సార్లు ఏడాదికి.. 2,3 పెళ్లిల్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇన్ని పెళ్లిల్లు ఎందుకు చేసుకున్నావయ్యా అంటే.. మనశ్శాంతి, స్థిరత్వం కోసమట. ప్రస్తుతం అతగాడి పెళ్లి పురాణం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
53 పెళ్లిల్లు చేసుకున్న ఆ వ్యక్తి పేరు అబూ అబ్దుల్లా.. వయసు 63.. నివసించేది సౌదీ అరేబియాలో. అబ్దుల్లాకు తొలిసారి 20 వ ఏట వివాహం అయ్యింది. రెండేళ్ల బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి దంపతుల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. అలా.. అబ్దుల్లా తన 23వ ఏట మొదటి భార్యకు తలాక్ చెప్పి.. విడాకులు తీసుకుని.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే అది కూడా ఎక్కువ రోజుల నిలవలేదు. ఆ తర్వాత మూడో భార్యను వివాహం చేసుకున్నాడు. అలా 43 ఏళ్ల కాలంలో 53 మందిని వివాహం చేసుకున్నాడు. కానీ ఒక్క భార్య వల్ల కూడా తనకు మనశ్శాంతి లేదని తెలిపాడు అబ్దుల్లా. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. చాలా మంది భార్యలకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు ఇచ్చాడట.
వరుస పెట్టి ఇన్ని పెళ్లిల్లు చేసుకోవడంతో అబ్దుల్లాను ‘బహుభార్యా వేత్త’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాక అతడికి ఈ శతాబ్ధపు బహుభార్యావేత్త అని బిరుదు కూడా ఇచ్చారు. అయితే భార్యలు ఒకరితో ఒకరు గొడవపడడం అబ్దుల్లాకు చిరాకు కలిగిస్తుందట. వాళ్లు అలా గొడవ పడుతూ ఉంటే భరించలేక.. భార్యలకు తలాక్ చెప్పేశానని తెలిపాడు. ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘‘నన్ను సంతోషపెట్టి.. ఇంట్లో మనశ్శాంతి ఉండేలా చేసే భార్య కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇక ఒక పెళ్లి అయితే ఏకంగా ఒక్క రాత్రిలోనే ముగిసిపోయింది. పెళ్లైన మరుసటి రోజే ఆమెకు డైవర్స్ ఇచ్చాను. ఇక నేను వివాహం చేసుకున్న ఈ 53 మందిలో ఒక విదేశీ వనిత కూడా ఉంది. బిజినెస్ పనుల నిమిత్తం విదేశాలకు అక్కడ నా బాగోగులు చూసుకోవడానికి ఒక మహిళను వివాహం చేసుకున్నాను. 53 మందిని చేసుకున్నా ఒక్కరి వల్ల కూడా నాకు మనశ్శాంతి లేదు. ఇప్పటికైనా ఓ మంచి భార్య దొరుకుతుందేమో అని చూస్తున్నాను’’ అంటున్నాడు 63 ఏళ్ల అబ్దుల్లా. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.