బుల్లితెర యాంకర్ శివజ్యోతి పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. దాంతో ఆ యువకుడు తన బాధను శివజ్యోతికి సోషల్ మీడియా వేదికగా మెురపెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరగాళ్లు సైతం తమ పంథాను మారుస్తు.. తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. ఇక గత కొంత కాలంగా సెలబ్రిటీల పేరుతో మోసాలు జరగడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఫేస్ బుక్, ట్వీటర్, ఇన్ స్టా, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా బుల్లితెర యాంకర్ శివజ్యోతి పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు ఆన్ లైన్ నేరగాళ్లు. దాంతో ఆ యువకుడు తన బాధను సావిత్రి అలియాస్ శివజ్యోతికి సోషల్ మీడియా వేదికగా మెురపెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
యాంకర్ శివజ్యోతి అలియాస్ సావిత్రి.. తనదైన తెలంగాణ యాసలో వార్తలు చెప్పి కొద్దికాలంలోనే బుల్లితెరపై తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకుంది. ఆ న్యూస్ రీడింగ్ తో వచ్చిన ఫేమ్ తో వరుసగా టెలివిజన్ షోలల్లో మెరిసింది. ఇక బిగ్ బాస్ షో ద్వారా మరింతగా తెలుగు అభిమానులకు దగ్గరైంది సావిత్రి. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించి హోం టూర్ వీడియోలు కూడా చేసింది. అయితే శివజ్యోతి పేరును వాడుకుని సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని మోసగించి డబ్బులు వసూల్ చేశారు. వివరాల్లోకి వెళితే..
హుస్సేన్ అనే యువకుడికి శివజ్యోతి యూట్యూబ్ ఛానల్ ద్వారా రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయి అని టెలిగ్రామ్ ద్వారా లింక్ వచ్చింది. హుస్సేన్ సైతం శివజ్యోతి వీడియో లను రెగ్యూలర్ గా ఫాలో అవుతుండటంతో.. నిజంగానే పాయింట్స్ వచ్చాయని నమ్మాడు. దాంతో ఆ లింక్ ను క్లిక్ చేశాడు. అయితే ఈ రివార్డ్స్ అందుకోవాలి అంటే రూ. 1000 కట్టాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు. వారు చెప్పినట్లుగానే యువకుడు డబ్బులు చెల్లించాడు. తర్వాత మళ్లీ ఇంకో పేరు చెప్పి 3వేలు కట్టాలి అని మెసేజ్ పెట్టారు. హుస్సేన్ ఏమీ ఆలోచించకుండా ఆ డబ్బుని కూడా వారికి పంపించాడు. ఇదే మంచి తరుణం అనుకున్న సైబర్ నేరగాళ్లు మరో 6 వేలు కట్టాలి అంటూ హుస్సేన్ కు సూచించారు. మోసపోతున్నాను అని ఇంకా కనిపెట్టని హుస్సేన్ 6 వేలను సైతం వారి ఖాతాకు బదిలీ చేశాడు.
ఆ తర్వాత తన రివార్డ్ పాయింట్స్ ఏవి అని ప్రశ్నించగా.. అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో మోసపోయానని తెలుసుకున్న హుస్సేన్.. పూర్తి వివరాలతో పాటుగా తన సెల్ నెంబర్ ను యాంకర్ శివజ్యోతికి పంపించాడు. ఈ మోసంపై స్పందించింది సావిత్రి. ఆ యువకుడు పంపిన మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అభిమానులు ఇలాంటి వాటిని నమ్మకండి, నాకు అసలు టెలిగ్రామ్ ఖాతానే లేదు అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ శివజ్యోతి. గతంలో చాలా మంది సెలబ్రిటీల పేర్లు చెప్పి సైబర్ నేరగాళ్లు లక్షల్లో డబ్బులు దండుకున్నారు. మరి శివజ్యోతితో పేరుతో జరిగిన ఈ ఆన్ లైన్ మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.