హ్యాకింగ్ సమస్య సోషల్ మీడియాలో అంతకంతకీ పెరుగుతోంది. సాధారణ యూజర్ల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, అందులోనూ నటీమణుల అకౌంట్లు హ్యాక్ అవడం ఈమధ్య ఎక్కువైంది.
సోషల్ మీడియా వినియోగం ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యులే కాదు.. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి స్పోర్ట్స్ స్టార్స్, పొలిటీషియన్స్ ఇలా అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. తమ భావాలు పంచుకోవాలన్నా, చాట్ చేయాలన్నా, అప్డేట్స్ తెలుసుకోవాలన్నా సోషల్ మీడియా ఓ వేదికగా మారిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని పక్కనపెట్టలేని స్థాయికి చేరుకుంది. అయితే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు, హ్యాకింగ్ లాంటివి అందరిలోనూ గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా హ్యాకింగ్ అంటే చాలు.. అందరూ భయపడుతున్నారు. సెలబ్రిటీల అకౌంట్లు కూడా హ్యక్ అవడం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
తాజాగా అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. మలయాళ స్టార్ హీరోయిన్ సాధికా వేణుగోపాల్ గురించి వినే ఉంటారు. నటనతో పాటు ఆమె వేషధారణతోనూ అందర్నీ ఆకట్టుకుంటారు. సాధ్యమైనంతగా సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ అభిమానుల్లో ప్రత్యేకతను సంపాదించుకున్నారామె. అలాంటి సాధిక పేరుతో ఉన్న ఓ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోర్న్ ఫొటోలు దర్శనమిచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. ఈ విషయాన్ని కొంతమంది ఇండస్ట్రీ జనాలు ఆమెకు ఫోన్ చేసి తెలియజేశారు. ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసు కేసు పెట్టారు సాధిక. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే అతడి కెరీర్ పాడుచేయడం ఇష్టం లేక సాధిక కేసు వాపర్ తీసుకున్నారు.