విజయం అనేది అంత త్వరగా రాదు. రానంత వరకూ ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి అవమానాలు, కష్టాలు దాటుకుని వస్తేనే స్టార్లు అవుతారు. అందరూ అనుకుంటారు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారని. కానీ ఓవర్ నైట్ స్టార్ అవ్వడం కోసం స్టార్లు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతారు. తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలంటే ఎన్నో సవాళ్లు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఆ రంగంలో అడుగుపెట్టాలంటే అవకాశం ఇవ్వరు. మరోవైపు ఎంచుకున్న ఫీల్డ్ తప్పా? అని గిల్టీ ఫీలయ్యేలా కొంతమంది సూటిపోటి మాటలతో వెక్కిరిస్తారు. ఆ సమయంలో కొంతమందికి చనిపోదామనిపిస్తుంది. అలా అనుకున్న వారిలో మన తెలుగు వారి సీత మృణాల్ ఠాకూర్ ఒకరు. సీతారామం సినిమాలో సీత పాత్రలో ఒదిగిపోతూ.. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న మృణాల్ జీవితం అంత గొప్పగా ఏమీ సాగలేదు. తాను ఈ స్టేజ్ కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.
మృణాల్ ఠాకూర్ మహారాష్ట్రలోనే పుట్టి పెరిగారు. ఆమె తండ్రి బ్యాంకు ఉద్యోగి కావడంతో.. తన కూతుర్ని డాక్టరో, ఇంజనీరో చేయాలని అనుకున్నారు. ఇంటర్ అయ్యాక డెంటిస్ట్ అవ్వాలన్న మృణాల్ యాంబిషన్ ని చూసి ‘మా తల్లే అయిపో’ అని అమ్మ, నాన్నలు సంతోషించారు. బీడీఎస్ చేద్దామని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన మృణాల్ కి మంచి ర్యాంక్ రావడంతో ఇంట్లో వాళ్ళు ఇక డాక్టర్ అయిపోయినట్టే అని సంబరపడ్డారు. అయితే కొన్ని రోజులకి మీడియా ఫీల్డ్ లోకి వెళ్లాలనిపించింది మృణాల్ కి. మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో వాళ్లకి ‘3 ఇడియట్స్’ మూవీ చూపించి ఒప్పించారు. బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా కోర్స్ లో చేరారు మృణాల్. అయితే అందరూ వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలో వెళ్తుంటే వెక్కిరించే వాళ్ళు ఉంటారుగా. అలానే మృణాల్ జీవితంలో కూడా ఉన్నారు.
ఆమె తండ్రిని నీ కూతురు ఏం చదువుతుంది అని అడిగితే.. బీఎంఎం (బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా) అని చెప్పారట. అయితే బీఎంఎం ఆ? అదేం కోర్సు? అసలు అదొక చదువా? అన్నట్టు నాన్నని అవమానించేవారట. దీంతో ఆమె తండ్రి చాలా బాధపడేవారట. కొన్ని రోజులకి ఆమె తండ్రికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ముంబైలో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒంటరితనం, నాన్నని బాధపెడుతున్నానన్న భావన.. కారణంగా చదువు మీద దృష్టి పెట్టలేకపోయిన మృణాల్ ఇక మీడియా రంగం కరెక్ట్ కాదని వదిలేద్దామనుకున్నారట. ఆలోచనలు ఎక్కువ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందట. లోకల్ ట్రైన్ లో కాలేజ్ కి వెళ్తున్నప్పుడు.. డోర్ దగ్గర నిలబడి బయటకు దూకేయాలని అనుకున్నారట. కానీ ఆమె తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఆగిపోయారట. జర్నలిజం నేర్చుకుంటున్న సమయంలో స్నేహితులు ఆమెని సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారట.
స్నేహితుల టాలెంట్ గుర్తించకపోతే స్నేహితులెలా అవుతారు. అలా ఆమె టాలెంట్ ని స్నేహితులు ప్రోత్సహించడంతో సినిమాలపై ఆసక్తి కలిగిందట. సొట్టబుగ్గల ప్రీతిజింతాలా మోడలింగ్ చేసి.. సినిమా అవకాశాలు పొందాలని అనుకున్నారట మృణాల్. ఆలా చదువుకుంటూనే మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా ఓ షోలో ఒక దర్శకుడు చూసి 2012లో ‘ముఝే కుఛ్ కెహ్తీ హై ఖామోషియా’ సీరియల్ లో అవకాశం ఇచ్చారట. ఆ తర్వాత ఆమె ‘కుంకుమ భాగ్య’ సీరియల్ లో నటించి.. ఈ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రసారమైన ఈ సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. అయితే సినిమాల్లో నటించాలన్న కోరికతో మధ్య మధ్యలో ఆడిషన్స్ కి వెళ్లేవారట. కానీ ఎవరూ రానిచ్చేవారు కాదట.
“సీరియల్స్ చేసుకునే నీకు సినిమాలు ఎందుకు? నువ్వు హీరోయిన్ గా పనికిరావు. మాకు సీరియల్ లో పని చేసే నటులు అవసరం లేదు. మీకు సినిమా యాక్టింగ్ రాదు” అంటూ చులకన చేసేవారట. అయినప్పటికీ హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. అలా ఎన్నో ప్రయత్నాల తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ సినిమాలో అవకాశం వచ్చిందట. కానీ తనను తీసేసి అనుష్క శర్మని పెట్టారట. ఆ సినిమాలో అనుష్క శర్మ పాత్ర కోసం తనకు దర్శక, నిర్మాతలు కొన్ని రోజులు మల్ల యుద్ధంలో శిక్షణ కూడా ఇప్పించారు. మూడు నెలల్లో 11 కిలోలు బరువు తగ్గారట. మరి ఏమనుకున్నారో ఏమో చివరి నిమిషంలో ఆమెని తీసేసి అనుష్క శర్మని పెట్టారట. మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టగా.. లవ్ సోనియా అనే సినిమాలో కూడా అవకాశం వచ్చిందట.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం 2 వేల మందికి పైగా అమ్మాయిల్ని ఆడిషన్ చేస్తే.. అందులో నటించే అవకాశం మృణాల్ కి మాత్రమే దక్కింది. డబ్బుల కోసం కన్న కూతుర్ని వ్యభిచార గృహానికి అమ్మేస్తే.. తన చెల్లెలిని కాపాడుకునే అక్క పాత్రలో మృణాల్ నటించారు. అయితే ఈ పాత్ర కోసం ఆమె కోల్కతాలోని ఓ వేశ్య గృహంలో 2 వారాల పాటు ఉండి.. వారి కథలు విన్నారట. వారి కథలు విని తట్టుకోలేకపోయిన మృణాల్ కి.. బీపీ డౌన్ అయిపోయిందట. పదే పదే వారి కథలు కళ్ళ ముందు కనబడుతుండడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. కానీ దర్శకుడు కౌన్సిలింగ్ ఇచ్చి.. ధైర్యం చెప్పడంతో సినిమా విజయవంతంగా పూర్తి చేయగలిగారట. ఈ సినిమాలో మృణాల్ నటనకి ప్రశంసలు దక్కాయి. ఈ లవ్ సోనియా సినిమాని ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా చాలా దేశాల్లో ప్రదర్శించారు.
అలా మెల్ బోర్న్ లో ప్రదర్శించినప్పుడు మృణాల్ వెళ్లారట. మహానటి సినిమాని ప్రదర్శిస్తున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా మెల్ బోర్న్ వెళ్లారు. ఆ సమయంలోనే నాగ్ అశ్విన్ తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయమే ఇవాళ తన కెరీర్ ని మలుపు తిప్పుతుందని ఆమె అస్సలు ఊహించలేదట. సీతారామం సినిమాని వైజయంతి వారు నిర్మించిన విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ అంటే నాగ్ అశ్విన్ కూడా ఒక భాగమే కాబట్టి దర్శకుడు హను రాఘవపూడికి.. సీత పాత్రకి మృణాల్ అయితే కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని సూచించడంతో ఆమెనే తీసుకున్నారు. అలా ఈ సీత ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రతీ ఒక్కరి విజయం వెనుక ఎన్నో అవమానాలు, కష్టాలు ఉంటాయనేది మృణాల్ కథ వింటేనే తెలుస్తుంది.