ప్రముఖ ప్రవనచనకర్త.. గరికపాటి నరసింహారావు.. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవిలాంటి స్టార్ హీరోను ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబుతో సహా.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గరికపాటి ఇలా మాట్లాడటం తగదని విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది దసరా సందర్భంగా గురువారం అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా.. గరికపాటి నరసింహ రావు కూడా వచ్చారు.
ఈ క్రమంలో మెగాస్టార్‌ను చూసిన సంతోషంలో అభిమానులు ఆయనతో ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపారు. ఇక చిరంజీవి కూడా ఫ్యాన్స్‌ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేక వారితో ఫోటోలు దిగుతూ ఉండిపోయారు. దీనిపై గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి ఫోటో సెషన్ ఆపకపోతే.. తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని మైక్‌లో కాస్త గట్టిగానే చెప్పారు. ఈ క్రమంలో కాసేపటికి చిరంజీవి.. ఫోటోలు దిగడం ఆపి స్టేజీ మీదకు వెళ్లారు. అనంతరం గరికపాటిని పలకరించి.. పక్కన కూర్చిన ప్రసంగం ఆలకించారు.
అయితే గరికపాటి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ గరికపాటిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ‘‘మెగాస్టార్‌ని ఉద్దేశించి అలా అసహనం వ్యక్తం చేయడం ఏంటి.. ఆయన స్టార్ హీరో.. ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. అసలు అంతమంది ఆ ప్రోగ్రాంకి వచ్చిందే చిరంజీవిని చూడ్డానికి. అలాంటిది అభిమాన హీరోని చూసిన వెంటనే ఫోటోలు దిగాలని ఎవరైనా భావిస్తారు. ఇక అభిమానులే తన బలం అని నమ్మే చిరంజీవి.. వారిని నిరుత్సాహపరచరు. అందుకే అంత ఓపిగ్గా వారితో సెల్ఫీలు దిగారు. అందులో తప్పేం ఉంది. దీనిపై గరికపాటి మరి ఆ రేంజ్‌లో అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదు’’ అంటూ అభిమానులు మండిపడుతున్నారు.
‘‘బహుశా మెగాస్టార్ క్రేజ్ ముందు ఆయనను ఎవరు పట్టించుకోవడం లేదనే అక్కసుతోనే గరికపాటి.. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేసి ఉంటాడు. ఏది ఏమైనా సరే.. మెగాస్టార్‌పై గరికపాటి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం అంగీకారం కాదు. కనుక గరికపాటి.. చిరంజీవికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే’’ అంటూ మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గరికపాటికి ‘‘గిరిగిపాటి’’ అని పేరు పెట్టడమే కాక.. ఆయన ప్రవచనాలను అడ్డుకుంటామనే ఫోటో కార్డు ఒకటి ప్రసుత్తం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇక గరికపాటి వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే సెటైర్ వేశారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడని నాగబాబు ట్వీట్ చూస్తే అర్థం అవుతుంది అంటున్నారు నెటిజనులు. ”ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే” అంటూ నాగబాబు చేసిన ట్వీట్ గరికపాటిని ఉద్దేశించి చేసినదేనని నెటిజనులు భావిస్తున్నారు.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022