హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఎంతో గొప్పగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, వీ హనుమంతరావు, గరికపాటి నరసింగారావు వంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. 17 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చిన ఈ కార్యక్రమం.. ఈ ఏడాది ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. అలయ్ బలయ్ సందర్భంగా దత్తాత్రేయ, వీహెచ్, చిరంజీవి డబ్బులు వాయించి వచ్చిన వారిని ఉత్సాహ పరిచారు. గరికపాటి నరసింహారావు ప్రవచనాలు, ఛలోక్తులతో అందరినీ ఉత్సాహపరిచారు.
ఈ అలయ్ బలయ్ సందర్భంగా జరిగిన ఒక ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. గరికపాటి నరసింహారావు ప్రసంగం చేసే సమయంలో స్టేజ్ మీద మహిళలు అందరూ మెగాస్టార్ చిరంజీవితో ఫొటోలు దిగుతూ ఉన్నారు. ఎక్కువ మంది ఉండటంతో ఆ ఫోటోలు తీసుకునేందుకు కాస్త సమయం పట్టింది. అంతేకాకుండా చిరంజీవితో ఫొటోలు తీసుకునే ఆసక్తిలో ఎవరూ గరికపాటి నరసింహారావు ప్రవచనాల మీద దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. ఇంతలో గరికపాటి కాస్త అసహనం వ్యక్తం చేశారు. “చిరంజీవి గారు మీరు కాస్త ఆ ఫొటో షూట్ ఆపితే నేను మాట్లాడతాను” వ్యాఖ్యానించారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
చిరంజీవి గారు మీ ఫోటో సెషన్ ఆపితే నేను మాట్లాడాలి – ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు#GarikapatiNarasimhaRao #Chiranjeevi #MegastarChiranjeevi #AlaiBalai #Nampally #Hyderabad #NTVTelugu pic.twitter.com/X0Av64Jufj
— NTV Telugu (@NtvTeluguLive) October 6, 2022
ఈ వైరల్ వీడియో గురించి చిరంజీవికి ఛేదు అనుభవం, చిరంజీవిపై గరికపాటి సీరియస్ అంటూ చాలానే వార్తలు వచ్చాయి. ప్రవచనకర్త కోపగించుకోవడాన్ని తప్పుబట్టలేం. అలాగని చిరజీవిది తప్పు అని కూడా చెప్పలేం. ఎందుకంటే అలయ్ బలయ్ కార్యక్రమానికి ఎప్పుడూ సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా వస్తుంటారు. అక్కడికి వచ్చిన వారు దాదాపుగా సెలబ్రిటీలే అయిఉంటారు. అందులోనూ ఈ ఏడాది చిరంజీవి రావడంతో ఆయనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. దాంతో చిరుతో ఫొటోల కోసం ఎగబడ్డారు. అంతేకాకుండా మహిళా అభిమానులు చుట్టుముట్టి ఫొటోలు అడగడంతో చిరంజీవి సైతం కాదనలేకపోయారు. అంతకంటే ముందే గరికపాటి నరసింహారావు గురించి చిరంజీవి ఎంత గొప్పగా మాట్లాడారో చూశాం. వీలు చూసుకుని త్వరలోనే ఇంటికి ఆహ్వానిస్తాను అంటూ చిరంజీవి చెప్పడం విశేషం.