ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలనేవి ఎక్కువగా వస్తున్నాయి. వేరే భాషల్లోకి మన సినిమాలు రీమేక్ అవ్వడం గురించి పక్కనపెడితే.. వేరే భాషల్లోని సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్న వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. అయితే.. ఈ రీమేక్ సినిమాల జాబితాలో చిన్న హీరోల దగ్గరనుండి అగ్రహీరోల వరకూ ఉండటం గమనార్హం. అదీగాక కొత్త కథలను కాకుండా పరభాషలో సూపర్ హిట్ అయిన సినిమాలనే ఎంపిక చేసుకోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ఓటిటి మాధ్యమాలు అందుబాటులో ఉండటంతో సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని చూసేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆల్రెడీ ఓటిటిలో ఉన్న సినిమాను రీమేక్ చేయాలనుకోవడం సాహసమనే అంటున్నారు.
తాజాగా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు.. రీమేక్ మూవీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. 2019లో ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ అనే మలయాళం మూవీ విడుదలై మంచి హిట్ అందుకుంది. అయితే.. ఆ సినిమా రీమేక్ హక్కులను మంచు విష్ణు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాను మోహన్ బాబు హీరోగా తాను నిర్మించనున్నట్లు విష్ణు రీసెంట్ గా జిన్నా ప్రమోషన్స్ లో తెలిపాడు. మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా మూవీ.. దీవాలి సందర్భంగా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. జిన్నా ప్రమోషన్స్ లో భాగంగా కొచ్చి వెళ్లిన విష్ణు.. అక్కడి ప్రెస్ మీట్ లో ఆండ్రాయిడ్ కుంజప్పన్ మూవీ రీమేక్ ని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇక మలయాళ సినిమాను సేమ్ తీయకుండా తెలుగు నేటివిటీకి. మోహన్ బాబు ఇమేజ్ కి తగిన మార్పులు చేస్తున్నట్లు చెప్పాడట. రీమేక్ సినిమాలలో తెలుగు నేటివిటీని జోడించి తీసిన సినిమాలు హిట్ అవుతుండటం ఇటీవల చూస్తూనే ఉన్నాం. అయితే.. ఈ ఆండ్రాయిడ్ కుంజప్పన్ తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ మూవీ. అందులో సోల్ చెడిపోకుండా అంతే హార్ట్ టచింగ్ గా చూపించే ప్రయత్నం చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపాడు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు తండ్రి పాత్రలో కనిపించనుండగా, కొడుకు పాత్రలో వేరే యాక్టర్ కనిపించనున్నాడట. ఎందుకంటే.. విష్ణుకి మోహన్ బాబుతో నటించడం భయమని చెప్పడం ఆశ్చర్యకరం. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. చూడాలి మరి కలెక్షన్ కింగ్ ని ఆండ్రాయిడ్ కుంజప్పన్ హిట్ ఇస్తుందేమో!