‘కేజీఎఫ్’ చిత్రంతో కన్నడ పరిశ్రమ సత్తా ఏంటి అన్నది దేశ వ్యాప్తంగా తెలిసొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘చార్లీ777’, ‘విక్రాంత్ రోణా’ చిత్రాలు కూడా మంచి ఆదరణ పొందాయి. అందుకు కారణం.. మలయాళ చిత్రాల దారిలో వారి నడవడమే. ప్రజల జీవన విధానం, మనలోని కథ అన్నట్లుగా ఉండేలా కథను ఎంచుకొని దాన్ని వస్తువులుగా మలిచి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ తరుణంలో రిషబ్ శెట్టి కథానాయకుడిగా వచ్చిన ‘కాంతారా‘ చిత్రం అంతకుమించిన ప్రభంజనాన్ని సృష్టించింది. చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం అందుకొంది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంతన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా బడ్జెట్.. రాబట్టిన కలెక్షన్స్ తెలిశాక అందరూ నోరెళ్ళబెడుతున్నారు.
సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం భారీ ప్రభంజనమే సృష్టించింది. తొలి 15 రోజుల్లోనే ఒక్క కన్నడలోనే రూ.92 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి 15 రోజుల్లో ఈ చిత్రం రాబట్టిన వసూళ్ళు.. రూ.150 కోట్లకు పైమాటే. ఇంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తోన్న ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించారట. ఈ విషయం తెలిశాక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు బడా నిర్మాతలు ఆశ్చర్యపోయారట. అయితే ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తే భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు కనిపిస్తుంది. అంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేశారు. శనివారం (అక్టోబర్ 15) విడుదలైన ఈ చిత్రం.. మంచి ఓపెనింగ్స్ సాధించింది. తొలిరోజే రూ. కోటికి పైగా వసూళ్లు రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
1840 కాలానికి చెందిన ఓ రాజుకి ఆస్తి, సంపద, కుటుంబం, పిల్లలు, రాజ్యం ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక లోటు. అది తెలుసుకునేందుకు రాజ్యం మొత్తం తిరుగుతాడు. గుళ్లు, గోపురాలను సందర్శిస్తాడు. కానీ తనకు కావాల్సిన మనశ్శాంతి ఎక్కడా దొరకదు. దీంతో వెను తిరిగి వెళ్తున్న సమయంలో ఓ అడవిలోని ఓ శిల వద్ద ఆగిపోతాడు. అది చూడగానే తనలోని చింత మాయమై తెలియని ఆనందం కలుగుతుంది. తనకు ప్రశాంతతని ఇచ్చేది ఇదే అని తెలుసుకున్న ఆయన, ఆ శిలని ఇవ్వమని ఆ అడవి ప్రజలను కోరతాడు. అందుకు వారి అడవి దేవుడు అరుపు వినపడేంత దూరం తమకి ఇవ్వాలని కోరగా, ఆ అడవి మొత్తాన్ని వారికి ఇచ్చేస్తాడు.
కట్ చేస్తే.. రాజు కుమారుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించి కోర్టు మెట్లు మీద రక్తం కక్కుకుని మరణిస్తాడు. ఆపై కొన్నేళ్ల తర్వాత ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, దానిని ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్ (కిశోర్) సర్వే చేస్తుంటాడు. ఈ క్రమంలో ఊరిలో యువకుడు శివ(రిషబ్ శెట్టి)కి, ఫారెస్ట్ ఆఫీసర్‌కి గొడవలు మొదలవుతాయి. అతనిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తారు. మరోవైపు ఊరి పెద్ద(అచ్యుత్ కుమార్) అందరితో మంచిగా ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగమవుతూ వారికి పెద్ద దిక్కుగా ఉంటాడు. ఊరి జనం కోసం ఫారెస్ట్ ఆఫీసర్‌ని ఎదురిస్తాడు. అంతలోనే ఊర్లో దైవారాదన చేసే(కోలా ఆడే) శివ సోదరుడు హత్యకు గురవుతాడు. మరి ఆ హత్య చేసిందెవరు? ఊరి పెద్దకి, రాజుకి సంబంధమేంటి? తమ భూమిని కాపాడుకునేందుకు ఊరి ప్రజలు ఏం చేశారు? ఇందులో కోలా దేవుడి కథేంటి? అన్నది మిగిలిన సినిమా.