ఈ మధ్య దక్షిణాది చిత్రపరిశ్రమలు కంటెంట్ ప్రధానంగా క్వాలిటీ సినిమాలు తెరపైకి తీసుకొస్తున్నాయి. అందుకు నిదర్శనంగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్, విక్రాంత్ రోణ, కార్తికేయ 2 చిత్రాలు నిలిచాయి. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలయ్యాయి. కానీ.. ఇటీవల కన్నడ భాషలో మాత్రమే విడుదలై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన చిత్రం ‘కాంతార’. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో.. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా తెలుగు భాషలో రిలీజ్ అయ్యింది. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేసిన కాంతారపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆల్రెడీ కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం తెలుగువారిని ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం!
కాంతార చిత్రకథ 1847లో మొదలై.. 1980-1990ల మధ్య దశలవారీగా సాగుతుంది. రాజ్యపాలన చేసే ఓ రాజుకు.. సకల సంపదలు ఉన్నా.. జీవితంలో మనశ్శాంతి లేక మధనపడుతూ అడవిలోకి వెళ్లిపోతాడు. అడవి మార్గంలో ఓ దైవశిల ఎదురవడంతో రాజుకు అక్కడే తెలియని ఆనందం, మనశ్శాంతి లభిస్తాయి. అడవి ప్రజలు దైవంగా పూజించే ఆ శిలను తీసుకొని.. అడవి మొత్తాన్ని అక్కడి గ్రామస్తులకు రాసిచ్చేస్తాడు. అలాగే రాసిచ్చిన అడవిపై తన కుటుంబీకులకు కూడా ఎలాంటి అధికారం లేదని మాటిస్తాడు.
కట్ చేస్తే.. 1990ల టైంలో సదరు రాజకుటుంబీకులు మళ్లీ అడవి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మరోవైపు గవర్నమెంట్ వారు అడవి భూమిని సర్వే చేసేందుకు వస్తారు. మరి నిత్యం ఆ దైవశిలను పూజించే పేద ప్రజలు ఎలా అడవిని కాపాడుకున్నారు? తన గ్రామాన్ని, అడవిని కాపాడేందుకు శివ(రిషబ్ శెట్టి) ఏం చేశాడు? దైవాన్ని పూజించే భూత కోలం సంప్రదాయం ఏంటి? రాజకుటుంబీకుల అరాచకాల వెనుక అసలు రహస్యాన్ని జనాలు ఎలా గ్రహించారు? అసలు దైవశిలకు శివకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
మన సంస్కృతి, సంప్రదాయాలు.. వాటి మూలాలు.. నాగరికత.. మారుతున్న జీవన విధానాలను అద్దంపట్టే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలా ఓ అడవి ప్రాంతంలో నివసించే జనాల సంస్కృతి, సంప్రదాయాలకు.. మాస్ కమర్షియల్ అంశాలు జోడించి తీసిన సినిమా కాంతార. ఈ ఏడాది కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణ చిత్రాల తర్వాత కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగించిన సినిమా ఇది. ఎలాంటి భారీ హైప్.. హంగులు ఆర్భాటాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ఒక్కసారి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతలా ఏముంది ఆ సినిమాలో అని అందరిలో ఆసక్తిరేపింది.
1847 ప్రాంతంలో అడవి జనాల జీవన విధానాన్ని.. వారి సంస్కృతిని పరిచయం చేస్తూ ఈ సినిమా.. ఓ రాజు కథతో మొదలైంది. రాజ్యంలో అన్ని ఉన్నా జీవితంలో సంతోషం, మనశ్శాంతి లేని రాజు.. అలా అడవి మార్గంలో దైవశిల ఎదురవ్వడం, అక్కడే ఉన్న అడవి గ్రామస్తులు.. రాజుతో ఒప్పందం.. అడవిని గ్రామస్తులకు శాశ్వతంగా ఇచ్చే ఇంటరెస్టింగ్ అంశాలతో కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. కట్ చేస్తే.. 1980లో తరాలుగా వరాహ రూపంలో దైవాన్ని పూజిస్తూ వస్తున్న హీరో శివ(రిషబ్ శెట్టి) ఫ్యామిలీ ఇంట్రడక్షన్.. ఊరిలోకి రాజుకుటుంబీకులు రావడంతో అసలు కథ మొదలవుతుంది.
ఆ తర్వాత 1990లో.. హీరో శివ క్యారెక్టర్ లో రిషబ్ శెట్టి మాస్ ఇంట్రడక్షన్.. అతని క్యారెక్టరైజేషన్.. తల్లి, ఫ్రెండ్స్.. శివ లైఫ్ స్టైల్.. లవ్ స్టోరీతో ఫస్ట్ హాఫ్ చాలా ఇంటరెస్టింగ్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఇక సెకండాఫ్ లో శివకు, ఫారెస్ట్ ఆఫీసర్ మురళీధర్(కిషోర్)కి మధ్య గొడవ.. ఊరికి రాజైన దేవేంద్ర(అచ్యుత్ కుమార్) అక్రమాలు.. శివ ప్రేమించే అమ్మాయి లీలా(సప్తమిగౌడ) మధ్య లవ్ సీన్స్ తో కథను పీక్స్ లోకి తీసుకెళ్లారు. ఈ సినిమా మొదలైనప్పటి నుండి అద్భుతమైన విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. మనల్ని కథలో లీనమయ్యేలా చేస్తాయి.
అన్నింటిని మించి స్క్రీన్ ప్లే.. రిషబ్ శెట్టి వేరియేషన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకులలో పూనకాలు రావడం పక్కా. అడవిని కాపాడుకోవాలనే ఓ బలమైన ఎమోషన్ కి.. దైవబలం తోడైతే ఎలా ఉంటుందో క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటనలో చూడవచ్చు. సింపుల్ కథలో బలమైన ఎమోషన్స్.. ఇంపాక్ట్ కలిగించే క్యారెక్టర్స్.. వీక్షకులను కదిలించే క్యారెక్టరైజేషన్స్.. అన్ని గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా భూత కోలం ఆడేటప్పుడు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పక్కాగా రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. మొత్తానికి క్లైమాక్స్ లో ఓ సినిమా కాదు.. ఓ అద్భుతాన్ని చూశామమే ఫీల్ తో ప్రేక్షకులు బయటికి వస్తారు.
కాంతార డబ్బింగ్ మూవీనే కావచ్చు.. కానీ.. తెలుగు కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమాకు రిషబ్ శెట్టి కథాకథనాలు ఎంత ప్లస్ అయ్యాయో.. అజనీష్ లోకనాథ్ సంగీతం.. అరవింద్ కష్యప్ సినిమాటోగ్రఫీ కూడా అంతే ప్లస్ అయ్యాయి. అలాగే హీరోయిన్ సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ ఇలా అందరు సైడ్ క్యారెక్టర్స్ లో జీవించేశారు. కాకపోతే ఎక్కడకూడా తెలుగు ముఖం కనిపించట్లేదనే ఆలోచన రాకుండా గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేశాడు రిషబ్ శెట్టి. ప్రొడక్షన్ వేల్యూస్ టాప్ నోచ్..
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రిషబ్ శెట్టి.. ఇతనిది తెలుగులో ఇదివరకు ‘బెల్ బాటమ్’ మూవీ చూశాం. కానీ.. కాంతార చేసే మ్యాజిక్ వేరు. అయితే.. ఈ జానర్ సినిమాలు గతంలో కూడా చూశాం. అయినా సీట్స్ లో నుండి లేవకుండా చేసిందంటే కారణం.. స్క్రీన్ ప్లే. మామూలుగా రాసుకోలేదు.. క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి యాక్టింగ్ కి నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోయే అవసరం లేదనిపిస్తుంది. అంతలా నటుడుగా, దర్శకుడుగా కేర్ తీసుకున్నాడు. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత మన నేలను.. సంస్కృతి సంప్రదాయాలను.. మన జీవన విధానంలోని అస్థిత్వాన్ని మరవొద్దనే పాయింట్ కాంతారలో గొప్పగా చెప్పారు. తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా కాంతార.