కేజీఎఫ్ లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా ఫ్రాంచైజ్‌ను నిర్మించి నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించిన మరో అద్భుత చిత్రం ‘కాంతార’. కేజీఎఫ్ పార్ట్ 1 లానే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ మోత మోగిస్తోంది. ఇక కన్నడ ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్న హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాక.. స్వయంగా నటించారు. ఇక కర్ణాటకలో సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు వచ్చింది. సినిమాకు కన్నడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినీ విమర్శకులు సైతం కాంతార సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రస్తుతం కాంతార సినిమా ఇతర భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఇక హిందీలో శుక్రవారమే విడుదల కాగా.. తెలుగులో ‘కాంతార’ సినిమాను.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గీత ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల అక్టోబర్ 15న అనగా శనివారం విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు హీరోలు ఇండస్ట్రీ ప్రముఖులు కాంతార సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా కాంతార సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. ఇక తాజాగా కాంతార సినిమాపై.. పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ హీరో ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు. ‘కాంతార’ సినిమాను రెండు సార్లు చూశానని.. అద్భుతమైన అనుభూతిని కలిగించిందని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గ్రేట్ కాన్సెప్ట్, థ్రిల్లింగ్ క్లైమాక్స్ సినిమాకు బలాలన్నారు. ఈ సినిమాను కచ్చితంగా థియేటర్‌లోనే చూడాలని సూచించారు. ఈ మేరకు ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్.. అయితే తప్పకుండా కాంతార సినిమాను థియేటర్‌లో చూస్తాం అని కామెంట్ చేస్తున్నారు.
అలానే మరో టాలీవుడ్ హీరో.. సాయిధరమ్ తేజ్ ట్విట్టర్‌లో కాంతార సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అది వైరలవుతోంది. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్‌లో.. ‘‘కాంతార లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి సినిమాలను కచ్చితంగా చూసి అభినందించాలి. ఆ సినిమా గురించి మాట్లాడాలి. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని పోస్ట్ చేశాడు.
Films like #Kantara are rarely made and should definitely be watched, appreciated and talked about .
All the best to the entire team @shetty_rishab @VKiragandur @hombalefilms @GeethaArts @gowda_sapthami @HombaleGroup @AJANEESHB pic.twitter.com/KuywkOzEY1— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 14, 2022
‘కాంతార’ అంటే సంస్కృత భాషలో అడవి అని అర్థం. ఇక మన ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను తిరిగి పంచుతుంది.. లేదని విధ్వంసం సృష్టిస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ, భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లాదకరంగా చూపించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి నటన ప్రధాన బలం అంటున్నారు. అలాగే.. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిచారు.