మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు మాత్రమే కాదు ఎంతో మందికి స్ఫూర్తి. నటుడిగా ఎదిగి.. మనిషిగా సాయం చేస్తూ.. అన్నయ్యగా అందరికీ దగ్గరయ్యారు. పాత తరాలకే కాదు.. వచ్చే తరాలకు కూడా ఆయన ఓ రోల్ మోడల్. ఇవన్నీ ఎవరో దారినపోయే వాళ్లు చెప్పిన మాటలు కాదు.. ఒక సెలబ్రిటీగా ఎదిగిన వాళ్లు ఒక శిఖరం గురించి చెప్పిన మాటలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. కొత్తా పాతా అనే సంబంధం లేకుండా కళాకారులను ప్రోత్సహించే మనిషి. చిన్నవాళ్లు సక్సెస్ సాధించినా ఫోన్ చేసి మరీ ప్రశంసించడం ఆయన అలవాటు. అయితే ఈ తరం వారికి చాలా మందికి అసలు చిరంజీవి సెట్‌లో ఎలా ఉంటారు? ఎంత నిబద్ధతతో పనిచేస్తారు అనే విషయాలు తెలియదు. అయితే ఆయన ఎలా ఉంటారు? ఎలా నటిస్తారు? అనే విషయాలను గాడ్ ఫాదర్ సినిమా డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
“ఒకరోజు సెట్‌లో అందరం కూర్చొని ఉన్నాం. సెట్‌లో ఆయన చిన్న పిల్లాడు అయిపోతారు. అందరూ ఒకసారి రండి నేను మీకు ఒకటి వినిపిస్తాను.. భూపాల అద్భుతంగా రాశాడు అని పిలిచారు. ఫస్ట్ టైమ్ నేను టీవీలో కనిపించాను, పేపర్లో పడ్డాను చూడు అని కొంతమంది చెప్తుంటారు. 44 ఏళ్లుగా ఇన్ని సినిమాల్లో నటించి.. ఇంతకన్నా ఎదిగేందుకు ఏం లేదు అనే స్థానంలో కూర్చొని కూడా నేను ఒకటి చేశాను చాలా అద్భుతంగా రాశారు అని చెప్పారు. అది వీడియో తీస్తేగానీ ఎవరూ నమ్మరు. ఒక మనిషిలో ఉండే విద్యకి ఆయన ఇచ్చే గౌరవం అది. ఆయన ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నారు. అలాగే ఉంటారు కూడా”.
“ఆయనకు ప్రాంటింగ్ ఎవరూ ఇవ్వరు. 10 పేజీల డైలాగ్ ఉన్నా కూడా నేర్చుకునే చెప్తారు. ఇప్పుడున్న వాళ్లు రెండో లైనుకే మర్చిపోతారు. ఆయన మాత్రం శ్రద్ధగా నేర్చుకునే చెప్తారు. ఆయన డైలాగ్ ఎంత శ్రద్ధగా నేర్చుంకుంటారో ఫొటో చూపిస్తాను(సెట్‌లో తీసిన ఫొటో చూపిస్తూ). ఇది సెట్‌లో ఆయన పద్ధతి. ఇంక ఈయన కాకుండా ఎవరు మెగాస్టార్ అవ్వాలి?. గాడ్ ఫాదర్‌కి సంబంధించిన విషయం ఒకటి చెప్పాలి. థియేటర్ లో ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో నేను రాసిన డైలాగ్‌ని ఆయన ఫ్లోలో ఒక పదం అటు ఇటు చెప్పారు. భూపాలా ఎలా ఉంది అంటే.. సార్ కాస్త మారుతుంది అని చెప్పాను. మొత్తం చెప్పేశారు.. క్లాప్స్, అంతా బాగుంది అన్నారు. షాట్ ఓకే అయ్యింది. కట్ చెప్పినా రాలేదు. నన్ను పిలిచారు.. నేను కాస్త అర్థం మారుతుంది సార్ అన్నాను. వెంటనే వన్‌మోర్ అన్నారు. ఆ డైలాగ్ డబ్బింగ్‌లో చెప్పుకోవచ్చు. డైరెక్టర్ కూడా బాగా వచ్చింది సార్ అన్నాడు. నీకు సేమ్ ఇస్తా చూడు ఇంకా బాగా ఇస్తాను అని మళ్లీ చెప్పారు. అలాంటి వ్యక్తికి ఫిదా అవ్వకుండా ఎలా ఉండగలం చెప్పండి” అంటూ లక్ష్మీ భూపాల చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు.