ఏనుగు నడుస్తున్నప్పుడు శునకాలు మొరుగుతాయని ఒక సామెత ఉంది. ఆ సామెత మెగాస్టార్ చిరంజీవి జీవితంలో అప్లై చేస్తే ఆయనొక ఏనుగు లాంటి వ్యక్తి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు.. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తుంటే ఆ దారిలో ఆయన్ని చూసి విమర్శలు, అభియోగాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, భటుడు నువ్వే, సైన్యం నువ్వే అని చిరు నవ్వుతో ముందుకు వెళ్ళిపోతారు. మెగాస్టార్ అనే వ్యక్తి ఒక మహా శిఖరం కదా, ఆయన ఎందుకు తగ్గి ఉంటారు, ఎవరైనా ఏదైనా అంటే ఇచ్చి పడేయచ్చు కదా అని ఆయన ఫ్యాన్స్ గానీ, ఆయన సన్నిహితులు గానీ ఫీలవుతుంటారు.
కానీ చిరు మాత్రం తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. తాజాగా ఇదే విషయాన్ని ఆయన ముందుంచితే దానికి చిరు చాలా హుందాగా సమాధానమిచ్చారు. తగ్గి ఉండడం వల్ల కోల్పోయేదేమీ లేదని ఆయన చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక మెట్టు దిగడం అంటే దిగజారడం కాదని ఆయన చెప్పిన జీవిత సత్యం వింటే ఈ జీవితాన్ని లైఫ్ లాంగ్ చిరు నవ్వుతో లీడ్ చేసేయచ్చు అన్నంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ విషయాన్ని అయినా సానుకూలంగా తీసుకుంటారు. ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతారు గానీ చిరు మాత్రం సంయమనం పాటిస్తారు. రీసెంట్ గా చిరు, గరికపాటి మధ్య రేగిన చిచ్చు విషయంలో కూడా చిరు చాలా సంయమనం పాటించారు. ఎందుకు ఓవర్ రియాక్ట్ అవ్వడం అని పెద్దగా పట్టించుకోలేదు.
కానీ చిరు అభిమానులు మాత్రం ఊరుకోలేదు. చిరంజీవి అంతటి మహా శిఖరాన్ని అంత మాట అనచ్చునా అని గరికపాటి మీద విమర్శలు చేశారు. ఇదే అంశం గురించి చిరు దగ్గర ఒక మీడియా మిత్రుడు ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంతటి మెగా విజయాన్ని సాధించిన సందర్భంగా చిరంజీవి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక మీడియా మిత్రుడు.. ఎందుకు మీరు తగ్గి ఉంటారు అని ఒక ప్రశ్నని చిరంజీవి ముందు ఉంచారు. “చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటి అని ముందుకు వెళ్తుంటారు. అభిమానులు, సన్నిహితులు చిరంజీవి తగ్గడం ఏంటని ఒక ఫీలింగ్ ఉంటుంది. మెగాస్టార్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక అడుగు దిగాల్సిన అవసరం ఉందంటారా?” అని అడిగారు.
దానికి మెగాస్టార్ జవాబిస్తూ ఇలా అన్నారు. అడుగు కిందకి తగ్గడం అనేది కాదు, సంయమనం పాటిస్తే నిజాలు నిలకడగా తెలుస్తాయి. తప్పు చేయం. చేస్తే వెంటనే పొరపాటయిపోయిందని ఒప్పుకునే మనస్తత్వం ఉన్న వారి మీద, అవతలి వారు నీ తప్పు లేకుండా ఒక మాట అంటే, నీ మీద అభియోగాలు చేస్తే.. వెంటనే దాన్ని ఢీ కొనాల్సిన అవసరం లేదు. నిజం నిలకడగా తెలుస్తుందని పూర్తి స్థాయిలో నమ్మేవాడిని. అలా నమ్మాను కాబట్టే.. నా మీద ఎన్నో అభియోగాలు చేసినప్పుడు అవి నిజం కాదు కాబట్టే ఉలిక్కిపడలేదు. ఎందుకంటే చిరంజీవి తప్పు చేయడు. ఏ తప్పు చేయని నన్ను ఎవరైనా ఏమైనా అంటే స్పందించను. నేను ఎవరినీ ఏమీ అనను. వాళ్ళ తప్పులు తెలుసుకుని వాళ్ళే నాతో కలుస్తారు.
అయితే ఒకప్పుడు తనను తిట్టారు కదా అని మాట్లాడకుండా ఉండడం అనేది తన వ్యక్తిత్వం కాదని అన్నారు. బ్యాంకులో నా బ్యాలన్స్ ఎంత, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చేర్చుకున్నానన్నది కాదు. ఈ హృదయానికి ఎన్ని మనసులని దరి చేర్చుకున్నాను అన్నదే ప్రధానం. కాబట్టి నన్ను ఎద్దేవా చేసిన వారు వాళ్ళ తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు వారిని ఆలింగినం చేసుకోవడం ఒక్కటే తనకు తెలుసని, ఒక రకంగా ఎక్కువ మంది మనసుల్ని గెలుచుకున్న వ్యక్తిగా ఉన్నానంటూ చిరు తాను ఎందుకు తగ్గి ఉంటారో చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ చిరుని.. “ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు” అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.