మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. చిరంజీవి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచింది. కంటెంట్ పరంగా, కలెక్షన్ల పరంగా సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. మెగా మాస్ జాతర మొదలైందని అభిమానులు కాలర్ ఎగరేసుకుంటున్నారు. ఊహించని రేంజ్ లో ఈ సినిమాకి ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బహుశా బ్రహ్మ పాత్ర ప్రభావం అనుకుంట. బ్రహ్మగా చిరంజీవి ఈ సినిమాలో తన మార్కు చూపించారు. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.
సినిమా ఇంత ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేషన్ సభ్యులు కొంతమంది చిరంజీవి ఇంటికి వెళ్లారు. గాడ్ ఫాదర్ సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు మెగాస్టార్ చిరుకి అభినందనలు తెలియజేశారు. చిరుకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో చిరంజీవి చాలా సేపు ముచ్చటించారు. గాడ్ ఫాదర్ సినిమా విశేషాలను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. లూసిఫర్ మాతృకను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశామని, మార్పులు చేయడమే మంచిదయ్యిందని చిరు అన్నారు. తాను నటించిన టాప్ 5 చిత్రాల్లో గాడ్ ఫాదర్ సినిమా ఉంటుందని మెగాస్టార్ అన్నారు. గాడ్ ఫాదర్ సినిమా చూస్తే మెగాస్టార్ చెప్పింది నిజమే అనిపిస్తుంది.