ప్రముఖ నటి, బిగ్ బాస్ కంటిస్టెంట్ ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పీఏ బెదిరింపులకు పాల్పడ్డాడని అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్రేట్ గ్రాండ్ మస్తీ, హసీనా పార్కర్, బారాత్ కంపెనీ సినిమాల్లో నటించిన అర్చన గౌతమ్.. బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 16 కంటిస్టెంట్ గా బాగా పాపులర్ అయ్యింది. ఈ షోలో మూడవ రన్నరప్ గా నిలిచింది. నటిగా కొనసాగుతూనే 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయితే ఈమెను ప్రియాంక గాంధీ పీఏ చంపేస్తానని బెదిరించాడని, అసభ్యపదజాలంతో దూషించాడని ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వ్యక్తిగత సహాయకుడు మీద మీరట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు, నటి అర్చన గౌతమ్ ని చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె తండ్రి గౌతమ్ బుద్ధ ఆరోపించారు. ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అర్చన గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు ప్రియాంక గాంధీ పీఏ సందీప్ సింగ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానం కింద సెక్షన్ 504, నేరపూరిత బెదిరింపునకు పాల్పడినందుకు సెక్షన్ 506, అసభ్యపదజాలంతో లేదా అసభ్యకరమైన చర్యలతో మహిళను ఉద్దేశపూర్వకంగా కించపరిచినందుకు సెక్షన్ 509 కేసులు వేసినట్టు మీరట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ సింగ్ సజ్వాన్ వెల్లడించారు. సందీప్ సింగ్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేసినట్లు తెలిపారు.
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తన కూతురు అర్చన గౌతమ్ ని ప్రియాంక గాంధీ కలవాలనుకుంటున్నట్లు సందీప్ సింగ్ గత నెలలో తన కూతురిని పిలిచాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన కూతురు ఆ ప్లీనరీ సమావేశాలకు వెళ్ళినప్పుడు ప్రియాంక గాంధీ పీఏ తప్పుగా ప్రవర్తించాడని, చంపేస్తా అని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు కులాన్ని దూషిస్తూ తన కూతురిని అవమానించాడని ఫిర్యాదులో వెల్లడించారు.
బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్ రాజకీయ నేతగా మారి 2022లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీయే ఎన్నికల సమయంలో హస్తినాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి దళిత రాజకీయ నేతగా అర్చన గౌతమ్ పేరు తెచ్చుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తనకు అవమానం జరిగిందని.. గతంలో వీడియో కూడ చేసింది. దీనిపై ఈమె తండ్రి కేసు పెట్టడంతో పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. మరి ఈ విషయంలో ఈ బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్ కి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.