వైజయంతి మూవీస్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ సంస్థ టాలీవుడ్‌లో ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించింది, నిర్మిస్తోంది. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సూపర్ స్టార్లతో ఎన్నో గొప్ప హిట్స్ అందుకుంది. అంతేకాకుండా మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నారా రోహిత్‌లాంటి వారిని హీరోలుగా పరిచయం చేసింది.
వైజయంతి మూవీస్ బ్యానర్ 50 ఏళ్ల ప్రస్థానంలో గెలుపు, విజయాలు, సూపర్ హిట్లే కాదు.. పరాజయాలు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. 2002లో చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర సినిమా తర్వాత 2019లో వచ్చిన మహర్షి సినిమా దాకా దాదాపు 17 ఏళ్లపాటు సరైన హిట్ పడలేదు. సినిమా సూపర్ హిట్ అయ్యిందిని చెప్పుకునే అవకాశం దక్కలేదు. ఆ తర్వాత మళ్లీ వైజయంతీ మూవీస్ కానివ్వండి, దాని అనుబంధ సంస్థలు కానివ్వండి సూపర్ హిట్లు అందుకున్నాయి.
అయితే ఈ విజయాలు, మారిన పరిస్థుతుల వెనుక అశ్వినీ దత్ అల్లుడు నాగ్ అశ్విన్ పాత్ర ఉందనేది గట్టిగా వినిపిస్తున్న టాక్. నాగ్ అశ్విన్ మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ని నిర్మించింది ప్రియాంక దత్, స్వప్న దత్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నాగ్ అశ్విన్- ప్రియాంక దత్ మధ్య ప్రేమ చిగురించింది. 2015లో వాళ్లిద్దరూ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వైజయంతి బ్యానర్ పై నాగ్ అశ్విన్ మహానటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ఎప్పుడైతే నాగ్ అశ్విన్ అల్లుడుగా అడుగు పెట్టాడో అప్పటి నుంచి వైజయంతి మూవీస్ పతాకం స్వరూపమే మారిపోయిందని చెబుతుంటారు. అప్పటి వరకు హిట్ కోసం ఎదురుచూసిన పతాకం తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్తుండటమే ఉదాహరణగా చెబుతున్నారు. పిట్టగోడ సినిమా తర్వాత సరైన అవకాశం లేక షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటున్న అనుదీప్‌కు అవకాశం ఇచ్చింది నాగ్ అశ్విని అందరికీ తెలుసు.
అప్పటివరకు డైరెక్టర్ గా ఉన్న నాగ్ అశ్విన్.. ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి స్వప్న సినిమా బ్యానర్ పై జాతి రత్నాలు సినిమా నిర్మించాడు. ఆ సినిమా సాధించిన విజయం, కలెక్షన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు విడుదలై సూపర్ టాక్ సొంతం చేసుకున్న ‘సీతా రామం’ సినిమా డైరెక్టర్‌కు అవకాశం కల్పించాలని కోరింది నాగ్ అశ్వినే అని చెబుతున్నారు.
లై, పడి పడి లేచే మనసు సినిమాల తర్వాత హను రాఘవపూడికి మళ్లీ అవకాశం వస్తుందని చాలా మంది అనుకోలేదు. కానీ, నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ చొరువతో వైజయంతి మూవీస్ ఆ అవకాశం కల్పించింది. ఇప్పుడు సీతా రామం సినిమా సూపర్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొణె వంటి స్టార్లతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్-K అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.
ప్రాజెక్ట్-K సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ దేశమే ఎదురు చూస్తోంది. ఒకప్పుడు విజయం కోసం తహతహలాడిన వైజయంతి మూవీస్ పతాకం ఇప్పుడు విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇదంతా నాగ్ అశ్విన్ అల్లుడిగా వచ్చిన తర్వాతే అశ్వినీ దత్ కు బాగా కలిసొచ్చింది. వైజయంతి మూవీస్ పతాకానికి పూర్వ వైభవం వచ్చిందని చెబుతున్నారు. వైజయంతి మూవీస్ పతాకం విజయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.