బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. సాహూ, రాధే శ్యామ్ సినిమాలు కంటెంట్ పరంగా కాస్త నిరాశపరిచాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు తర్వాత చేయబోయే సినిమాల మీదనే పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలు రెడీ అవుతున్నాయి. దీని కంటే ముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రాబోతుంది. ఇప్పటి వరకూ దేశం గర్వించతగ్గ సినిమాలు చేసిన ప్రభాస్.. ఆదిపురుష్ తో ప్రపంచం గర్వించతగ్గ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి.
రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో రాముడు, రావణుడి పాత్రలని తప్పుగా చూపించారని కొంతమంది ఆరోపణలు చేశారు. రామాయణంలోని పాత్రలు ఎలా ఉంటాయో.. ఒకసారి పాత సినిమాలు చూడండి అంటూ సలహా కూడా ఇచ్చారు. ఇక పౌరాణిక సినిమాలని తెరకెక్కించాలంటే మన తెలుగు వాళ్ళ తర్వాతే ఎవరైనా అన్న విమర్శలు సైతం వచ్చాయి.
తాజాగా ఆదిపురుష్ సినిమా యూనిట్ కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు గాయపడేలా పాత్రలు ఉన్నాయని.. సినిమా విడుదలపై స్టే విధించాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ని విచారించిన ఢిల్లీ హైకోర్టు.. హీరో ప్రభాస్ కి, చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ వేసిన వారి అభ్యంతరాలకు సరైన వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. మరి దీనిపై ప్రభాస్ అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.