సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీపై జరిగినంత ట్రోలింగ్ మరేవరి మీద జరగదు. మరీ ముఖ్యంగా మంచు లక్ష్మీ, విష్ణులు ఎక్కువగా ఈ ట్రోలింగ్ బారిన పడతారు. వారు మాట్లాడే మాటలే ట్రోలర్స్‌కి అవకాశం ఇస్తాయి. అయితే తాజాగా ఇందుకు భిన్నమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మంచు విష్ణు మాటలకు ముచ్చటపడి చప్పట్లు చరిచి మరి ప్రశంసించారు. అది కూడా బాలీవుడ్ మీడియా వాళ్లు కావడంతో.. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. తాజాగా మంచు విష్ణు.. జిన్నా సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది. హిందీలో జిన్నాభాయ్‌గా విడుదల అవుతోంది ఈ సినిమా. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబై వెళ్లిన విష్ణు.. అక్కడ సినిమా హిందీ ట్రైలర్, రెండు పాటలను విడుదల చేశారు. ఆ తరువాత మీడియతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బాలీవుడ్ రిపోర్టర్లు మంచు విష్ణుకు కొన్ని వివాదాస్పద ప్రశ్నలు స్పందించారు. అయితే విష్ణు ఏమాత్రం తడుముకోకుండా.. ఆ ప్రశ్నలన్నింటికీ తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. ఆయన సమాధానాలు విన్న బాలీవుడ్ మీడియా చప్పట్లు కొట్టి ప్రశంసులు తెలిపింది. ఈ క్రమంలో ‘జిన్నా’ టైటిల్ వివాదం గురించి ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘‘కాంట్రవర్సీ మంచిదే. దీని వల్ల నా సినిమా గురించి తెలియని వాళ్లకు కూడా ఇప్పుడు తెలుస్తుంది’’ అని విష్ణు సమాధానం ఇచ్చారు. అలానే జిన్నా సినిమా విడుదల తేదీని అక్టోబర్ 5 నుంచి 21కి వాయిదా వేయడంపై మరో ప్రశ్న సంధించారు. దీనికి కూడా తడుముకోకుండా.. అటు పెద్ద సినిమాల పేరు తీయకుండా చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు.
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘‘జిన్నా సినిమాను అక్టోబర్ 5న విడుదల చేస్తానని నేనెప్పుడూ ప్రకటించలేదు. కొన్ని నెలల క్రితం ఆ తేదీని నేను క్యాలెండర్‌లో మార్క్ చేసుకున్నానంతే. ఆ తేదీన జిన్నా సినిమా ట్రైలర్ విడుదల చేశాను. అలానే మా సినిమా అక్టోబర్ 5న విడుదలవుందని చాలా మంది ప్రచారం చేశారు. నేను మాత్రం ఆరోజున అంటే అక్టోబర్ 5న నా సినిమా ట్రైలర్ విడుదల చేశాను. ఇక సినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేయడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే.. మా సినిమాలో జిన్నా ఒక దీపావళి క్రాకర్ అని ఓ డైలాగ్ ఉంది. అందుకే, మేం దీపావళికే వద్దామనుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు విష్ణు.
‘‘బాహుబలి సినిమా తర్వాత.. దక్షిణాది చిత్రాలను హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలా అని చెప్పి విడుదలైన ప్రతి తెలుగు సినిమాను హిందీ ఆడియన్స్ ముందుకు తీసుకురాలేము. అక్కడి నేటివిటికి సంబంధించిన సినిమాలు.. ఇక్కడి ప్రేక్షకులను అలరించలేవు. అయితే మా జిన్నా సినిమా కథ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని భావించాం. అందుకే ఇక్కడికి వచ్చాం. ఇందుకు తాజాగా విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ సినిమానే ఇందుకు మంచి ఉదాహరణ. నేనొక అబద్ధాలకోరుని. నేను చెప్పే అబద్ధాలను థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు నమ్మేలా చేస్తే నేను విజయం సాధించినట్లే’’ అన్నాడు విష్ణు. అతడి మాటలు విన్న బాలీవుడ్ మీడియా ప్రతినిధులు.. చప్పట్లతో తమ ప్రశంసలు తెలిపారు.