పూరీ జగన్నాథ్, బండ్ల గణేష్ లకి ఎక్కడ చెడిందో, ఎప్పుడు చెడిందో, ఎలా చెడిందో తెలీదు గానీ వీరిద్దరి మధ్య వివాదం నడుస్తోందన్న వార్తలు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో నానుతున్నాయి. ఆ మధ్య చోర్ బజార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన బండ్ల గణేష్ పూరీపై సెటైర్లు విసిరారు. ఆ ఈవెంట్ కి పూరీ జగన్నాథ్ రాలేదు. దీంతో బండ్ల గణేష్.. తనదైన శైలిలో పూరీకి చురకలు అంటించారు. “ఎందరో స్టార్లని చేశాడు కానీ కన్న కొడుకుని స్టార్ ని చేయలేకపోయాడు. ఇవాళ కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు. నేనైతే లండన్ లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కొడుకు కోసం వస్తాను. నేను బతికేదే నా పెళ్ళాం కోసం, నా పిల్లల కోసం. మనం ఏం సంపాదించినా వాళ్ళ కోసమే. ఇంకోసారి ఇలా చేయకు” అంటూ పూరీ జగన్నాథ్ కి సలహా ఇచ్చినట్టే ఇచ్చి ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశారు బండ్ల గణేష్.
భార్యా, పిల్లల్ని పట్టించుకోడు అని పూరీ పరువు పబ్లిక్ గా తీసి పడేశారు. అయితే వాటిని దృష్టిలో పెట్టుకుని పూరీ జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్ లో బండ్ల గణేష్ కి కౌంటర్ ఇచ్చారని ఆ మధ్య కథనాలు వచ్చాయి. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రమాదమని, వీలైతే ఎక్కువ సేపు వినాలని, అతిగా మాట్లాడడం మంచిది కాదని హితబోధ చేశారు. ఈ మాటలు బండ్ల గణేష్ ని ఉద్దేశించినవే అని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇక్కడితో ముగిసిందనుకున్న వివాదం మరోసారి అగ్గి రాజుకుంది. తాజాగా బండ్ల గణేష్ మరోసారి పూరీపై సెటైర్లు వేశారు. ఈసారి డైరెక్ట్ గానే పూరీని విమర్శించారు. ఐ డ్రీమ్ నాగరాజుకిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలను ఎందుకు గెలుకుతున్నారని యాంకర్ అడగ్గా.. నేనేడ గెలికాననని” బండ్ల గణేష్ దాట వేశారు. పోసాని కృష్ణమురళీకి మామూలు చావు రాదని గతంలో బండ్ల గణేష్ అన్న మాటలని గుర్తు చేశారు. “నువ్వు పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. బండ్ల గణేష్ పడడు” అని బండ్ల గణేష్ సమాధానమిచ్చారు. అసలు పోసాని గురించి ఆ మాట ఎందుకన్నారు? ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీయే కదా అని అడగ్గా.. “బండ్ల గణేష్ మీద కోపముంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు. కానీ మా అమ్మ, నాన్న ఏం చేశారు?” అని బండ్ల గణేష్ అన్నారు. “మరి పూరీ జగన్నాథ్ ఎందుకు స్పందించారు? నాలుక జాగ్రత్తగా పెట్టుకో అని ఎందుకు అన్నారు?” అని యాంకర్ అడగ్గా.. భార్యని, బిడ్డని ప్రేమించనోడు మనిషా అన్న అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు.
దీంతో యాంకర్.. “ప్రేమించడం, ప్రేమించకపోవడం ఆయనిష్టం” అంటూ ఫోన్ చేయబోతే.. “పూరీ అనే వాడికి మంచి, చెడు చెప్పే రైట్ నాకుంది. నా ఫ్రెండ్” అని బండ్ల గణేష్ అన్నారు. ఈ వ్యవహారంతో పూరీ, బండ్ల గణేష్ ల మధ్య చెడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరీ.. భార్య, బిడ్డల్ని పట్టించుకోడని ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేసిన బండ్ల గణేష్.. ఈసారి డైరెక్ట్ గానే అనేశారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. అయితే ఇది ఇంటర్వ్యూ ప్రోమో మాత్రమే. ఫుల్ ఇంటర్వ్యూలో ఇంత వివాదాస్పదం ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సీరియస్ మేటర్ అయితే.. దీనిపై పూరీ ఎలా స్పందిస్తారో అనేది చూడాలి.