అజయ్.. యాక్టర్‌గా, విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 22 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. ఒక హీరోకి ఉన్న ఫాలోయింగ్ అజయ్‌కి సొంతం. టాలీవుడ్‌లో ఉన్న దాదాపు అందరు టాప్ హీరోలతో అజయ్ కలిసి పనిచేశాడు. ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోస్తుంటాడు. ఆ పాత్ర అజయ్ కోసమే పుట్టిందేమో అనేలా నటిస్తాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లోనూ అజయ్ ఎన్నో సినిమాలు చేశాడు. ఇటీవల 9 అవర్స్ అనే వెబ్‌సిరీస్‌తో నందమూరి తారకరత్న రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వెబ్‌సిరీస్‌లో అజయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. అటు సినిమాలే కాకుండా ఇటు వెబ్ సిరీస్‌ల మీద కూడా దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తన కేరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అజయ్ పంచుకున్నాడు. “నేను ఎప్పుడూ పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నటించాను. ఈ 22 ఏళ్లలో అదే చేశాను. తర్వాత రోజుల్లోనూ అదే చేస్తాను. మన క్యారెక్టర్ ఎంతసేపు సినిమాలో ఉంది, ఎన్నిసార్లు కనిపించింది అని కాకుండా.. ఎంత ప్రభావవంతంగా ఉంది అనేదే పరిగణలోకి తీసుకుంటాను. ఇన్నాళ్లు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే.. నాకు తగ్గ పాత్రలు దొరకలేదు అందుకే మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. నేను 19 ఏళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయి నేపాల్ వెళ్లాను. తిరిగి రావడానికి డబ్బులేక ఓ హోటల్‌లో గిన్నెలు కడిగి డబ్బు వచ్చాక ఇంటికి వచ్చాను” అంటూ అజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చాడు.
ఇంకి సినిమాల్లో విలన్ పాత్రలు, రేప్ సీన్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “శ్రీ మహాలక్ష్మి సినిమా సమయంలో ఒక ఘటన జరిగింది. అది నాకు ఇప్పటికీ గుర్తింది. ఒక మోడల్‌ను రేప్ సీన్ అని చెప్పకుండా తీసుకొచ్చారు. నేను వెళ్లి చేయిపట్టుకోగానే ఆమె గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దాంతో నేను ఈ సీన్ చేయలేను సార్.. నా వల్ల కాదు అని చెప్పేశాను. వందల మంది ముందు రేప్ సీన్ చేయడం చాలా చిరాకుగా ఉంటుంది. ఆ తర్వాత నాకు మళ్లీ రేప్ సీన్లో నటించే అవసరం, సందర్భం రాలేదు. ఆ విషయంలో మాత్రం నేను చాలా సంతోషిస్తాను” అంటూ అప్పటి ఒక ఘటనను అజయ్ గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా పాత్రల విషయంలో.. తనకు నచ్చిన పాత్రలు రాకపోతే సినిమాలు మానేసి వేరే పని చేసుకోవడానికి కూడా సిద్ధమే అంటూ అజయ్ ఓపెన్ కామెంట్స్ చేశాడు.