ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 20 విభాగాల్లో 14,523 పోస్టులను భర్తీ చేయనుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఏప్రిల్ నెలలో ఖాళీలను భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ అధికారులు యోచిస్తున్నారు. ఈసారి కూడా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ.. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖకు లేఖ రాసింది.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలను లేఖలో పేర్కొంది. 3 నెలల్లోగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల భర్తీ ప్రక్రియను నాలుగు నెలల్లో ముగించింది జగన్ సర్కార్. అయితే అప్పట్లో మిగిలిపోయిన ఖాళీలను 2020లో రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసింది. ఆ సమయంలో మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేయనుంది.