కోహ్లీ-గంభీర్ వివాదం ఈసారి ఐపీఎల్లో వన్ ఆఫ్ ది హైలైట్‌గా నిలిచింది. ఈ కాంట్రవర్సీతో లక్నో, ఆర్సీబీ మధ్య ఫ్యూచర్లో జరిగే మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ వివాదంలో మరో ప్లేయర్ నవీన్ ఉల్ హక్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచిన వాటిల్లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ల వివాదం ఒకటి. ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకరిపై ఒకరు దూసుకుంటూ వెళ్లడం, గొడవకు దిగడం విదితమే. ఈ కాంట్రవర్సీలో లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్ కూడా కలుగజేసుకోవడం తెలిసిందే. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ వివాదాన్ని కోహ్లీ ఫ్యాన్స్ వదల్లేదు. గంభీర్, నవీన్ ఉల్ హక్ కనిపించిన ప్రతి చోట కోహ్లీ, కోహ్లీ అని అరుస్తూ వారిని రెచ్చగొట్టారు. నవీన్ ఉల్ హక్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఒక మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ కాగానే స్వీట్ మ్యాంగోస్ అంటూ మామిడికాయలు తిన్న ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్‌కు మధ్య హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అభిమానులను దాడికి పాల్పడ్డారు.
గంభీర్, నవీన్ ఉల్ హక్ కూర్చున్న లక్నో డగౌట్ మీద కోహ్లీ ఫ్యాన్స్ నీళ్ల సీసాలు విసిరారు. అంతేగాక వారిపై నట్లు, బోల్టులు కూడా విసిరేశారు. దీంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు నిర్వాహకులు. ఇక్కడితో ఈ వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. గురువారం సన్‌రైజర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్‌కు కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (100) సెంచరీతో చెలరేగి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రశంసించింది. అదే తరుణంలో కోహ్లీని గెలికిన నవీన్ ఉల్ హక్‌ను ట్రోల్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది. ‘సారీ మ్యాంగో.. చీకూనే రియల్ కింగ్’ అంటూ విరాట్‌పై తమకు ఉన్న ప్రేమను చూపించింది.
Sorry mango.. cheeku is the real King 👑
— Swiggy Instamart (@SwiggyInstamart) May 18, 2023