ఐపీఎల్ లో ఇప్పటికే అన్ని జట్లు కనీసం రెండేసి మ్యాచ్ లు గెలిచేశాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 5 మ్యాచ్ లు ఆడినా ఇంకా ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ ఛాన్స్ సంక్లిష్టం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి.. కోచ్ పాంటింగ్, మెంటార్ గంగూలీ మోటివేట్ చేస్తూ కనిపించారు.
ఐపీఎల్ 2023 సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి సరిగ్గా కలిసి రావడం లేదు. పంత్ దూరం కావడం వలన కాస్త బలహీనంగా మారిన వార్నర్ సేన మరి ఇలాంటి ఘోర ప్రదర్శన చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా వరుస పెట్టి 5 మ్యాచ్ లు ఓడిపోవడం ఆ జట్టుని బాగా కృంగదీసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ విషయంలో భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్.. పాంటింగ్ ని ఉద్దేశించి ” గతంలో ఢిల్లీ జట్టు ఐపీఎల్ ఫైనల్ కి వెళ్తే క్రెడిట్ కొట్టేసావు. ఇప్పుడెందుకు ఓటములకు బాధ్యత వహించడం లేదు అని బహిరంగాగానే విమర్శించాడు. రవి శాస్త్రీ కూడా ఈ విషయంలో గంగూలీ, పాంటింగ్ మీద కాస్త ఘాటుగానే విమర్శించాడు. అయితే తాజాగా కోచ్ పాంటింగ్ ఢిల్లీ ఆటగాళ్లకు క్లాస్ తీసుకోవడం వైరల్ గా మారింది.
వరుసగా 5 ఓటములు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ పరిస్థితి ఇది. ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్ లు గెలిస్తే ఢిల్లీ జట్టు మాత్రం బోణి కొట్టలేకపోతుంది. ఇక మిగిలింది 9 మ్యాచ్ లు. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే కనీసం 8 మ్యాచ్ లు అయినా గెలిచి తీరాలి. ఈ దశలో ఢిల్లీ ప్లే ఆఫ్ కి వెళ్లడం సంక్లిష్టంగా మారింది. ఇక లాభం లేదనుకున్నారేమో.. కోచ్ రికీ పాంటింగ్, మెంటార్ గంగూలీ వార్నర్ సేనకు కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఆర్సీబీ మ్యాచ్ అనంతరం కుల్దీప్ సారీ చెప్పాడని తెలుస్తుంది. ఈ విషయంపై తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన వీడియోలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ కనిపించాడు.
“ముందుగా కుల్దీప్ నువ్వెక్కడ ? అంటూ మొదలు పెట్టాడు. గ్రౌండ్ లో జరిగినదానికి ఎప్పుడూ ఎవరికీ కూడా సారీ చెప్పకు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో నువ్వు బాగా బౌలింగ్ చేసావు. నాకు కావాల్సింది మీ సారీలు కాదు మెరుగైన ప్రదర్శన చేసి జట్టుకి విజయాలు అందించాలి. జట్టుగా మనం తిరిగి పుంజుకోవాలి. మళ్ళీ విజయాల బాట పట్టాలి”. అని చెప్పుకొచ్చాడు. ఇక మెంటార్ గంగూలీ కూడా మాట్లాడుతూ .. “ఈ పరాజయాలను మర్చిపోండి. గెలుపోటములు ఆటలో సహజం. మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. ఇంకా 9 మ్యాచ్ లు ఉన్నాయి. గెలిస్తేనే క్వాలిఫై అవుతాం అనే ఊహ పక్కన పెట్టండి. మన కోసం ఆడండి. మీకు వార్నర్ లాంటి స్ట్రాంగ్ కెప్టెన్ ఉన్నాడు. ఒక విజయం సాధిస్తే మళ్ళీ మనం పుంజుకుంటాం”. అని ఈ సందర్భంగా తెలియజేశాడు. మరి పాంటింగ్, గంగూలీ క్లాస్ తో ఢిల్లీ విజయాల బాట పడుతుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.